Diamonds Scam: వజ్రాల వ్యాపారి మెగా కుంభకోణం.. వేల కోట్ల స్కామ్.. పూర్తి వివరాలు
Winsome Diamonds Scam: వజ్రాల వ్యాపారానికి ఫేమస్ అయిన గుజరాత్ రాష్ట్రంలో వరుసగా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ తర్వాత దేశంలో మరో వజ్రాల వ్యాపారి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు. విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ యజమాని జతిన్ మెహతా, అతని కుటుంబం సంయుక్తంగా ఈ మోసానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ విలువ దాదాపు రూ.8,500 కోట్లని అధికారులు గుర్తించారు.

కుటుంబంపై ఆంక్షలు..
ఈ కేసులో వరల్డ్ వైడ్ ఫ్రీజింగ్ ఆర్డర్ని తొలగించాలని మెహతా కుటుంబం కోరుతోంది. ఇందులో భాగంగా అతనిపై, అతని సంస్థలపై అనేక ఆంక్షలు విధించబడ్డాయి. దీని కింద మెహతా కుటుంబం ఖర్చులకు పరిమితిని నిర్ణయించారు. మెహతా 1 బిలియన్ డాలర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆస్తుల విలువ కేవలం 146 మిలియన్ డార్లని ప్రకటించారు.

2013లో స్కామ్..
ఈ స్కామ్ 2013లో జరిగినప్పటికీ దానిపై మొదటి కేసు 2017లో నమోదైంది. మెహతా చేసిన స్కామ్ కూడా నీరవ్ మోడీ స్కామ్‌ను పోలి ఉంటుంది. ఇందులో బ్యాంకింగ్ క్రెడిట్ లైన్‌ను తప్పుగా ఉపయోగించుకుని రుణాలిచ్చే కంపెనీలను మోసగించారు. ఇందులో భాగమైన యూకే, ఐర్లాండ్‌కు చెందిన 7 కంపెనీలు మెహతా కుటుంబం నుంచి తమ డబ్బును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇతర కంపెనీలకు డైవర్ట్..
విన్సమ్ డైమండ్స్‌కు ఇచ్చిన బ్యాంకింగ్ సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ కంపెనీ యజమాని జతిన్ మెహతా డబ్బు లావాదేవీలు జరిపాడు.బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రిజిస్టర్డ్ కంపెనీ మారెంగో ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ లిమిటెడ్ 16.30 మిలియన్ పౌండ్లను పొందినట్లు కోర్టుకు సమాచారం అందింది. ఇదే సమయంలో UAE కంపెనీ అల్-నూరా FZE 650 మిలియన్ డాలర్లను పొందింది. ఆ తర్వాత ఈ రెండు కంపెనీలు కనుమరుగయ్యాయి. ఇలా యూఏఈ కేంద్రంగా కూడా ట్రాన్సాక్షన్లు జరిగాయని గుర్తించటం జరిగింది.

అన్ పాలిష్డ్ డైమండ్స్..
1985లో జతిన్ మెహతా తన కుమారుడు సూరజ్ డైమండ్ ఇండియా లిమిటెడ్‌ను ప్రారంభించారు. విదేశాల నుంచి అన్ పాలిష్డ్ వజ్రాలను తీసుకుని కంపెనీ వారు పాలిష్ చేసి ఎగుమతి చేసేవారు. విన్సమ్ గ్రూప్ కంపెనీలు వివిధ బులియన్ బ్యాంకుల నుంచి బంగారం, వజ్రాలను కొనుగోలు చేసేవి. బంగారం, వెండి, వజ్రాల వ్యాపారం, సరఫరా చేసే బ్యాంకులను బులియన్ బ్యాంకులు అంటారు. మెహతా కుటుంబం నకిలీ క్రెడిట్ లైన్ ఉపయోగించి భారీ కుంభకోణానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ కేసులను దాదాపు డజనుకుపైగా న్యాయవాదులు వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications