Dawood Ibrahim: ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం పాకిస్థాన కరాచీలో నివసిస్తున్నాడు.
కరాచీలో 67 ఏళ్ల దావూద్‌పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వచ్చాయి. మూడు దశాబ్దాలుగా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పాకిస్థాన్ అడ్డాగా దందాలు, అక్రమ వ్యాపారాలను నడుపుతున్నాడు. దావూద్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించి ఉంది. అతని భార్య మెహజబీన్, సోదరుడు అనీస్ సహకారంతో ఇదంతా నడుస్తోంది. 1980-90 మధ్య కాలంలో దావూద్ వ్యభిచారం, డ్రగ్స్, గ్యాంబ్లింగ్ వ్యాపారాలతో కోట్లు గడించాడు. అలాగే ప్రపంచ ఉగ్రవాద సంస్థ D కంపెనీకి అధిపతిగా మారాడు.

ఫోర్బ్స్ ప్రకారం దావూద్ ఆల్ టైమ్ ధనిక గ్యాంగ్‌స్టర్లలో ఒకడుగా నిలిచాడు. 2015లో అతని ఆస్తుల నికర విలువ 6.7 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం అప్పట్లోనే రూ.55 వేల కోట్లుగా ఉంది. పాకిస్థాన్‌లో 3 విలాసవంతమైన ఇళ్లున్నాయి. కరాచీలోని క్లిఫ్టన్‌లోని డి-13, బ్లాక్-4లో 6,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన బంగ్లాలో దావూద్ నివసిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలోకి బయటి వ్యక్తులను అనుమతించరు పైగా పాక్ రేంజర్లతో ఇక్కడ కాపలా ఉంటుంది.
దావూద్ పేరుపై ఒక హోటల్ కూడా ఉంది. దావూద్‌కు చెందిన అనేక ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. పైగా ఇండియాలో ముంబైతో పాటు ఇతర నగరాల్లో సైతం ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే దావూద్‌కు ముంబైలో హ్యుందాయ్ యాక్సెంట్ సెడాన్ కారును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ డాన్ IPL మ్యాచ్ ఫిక్సింగ్ నుంచి కూడా భారీగా డబ్బు సంపాదించాడు. పైగా అతనికి క్రికెట్ అంటే ఇష్టం. 2జీ స్పెక్ట్రమ్ సహా అనేక కుంభకోణాల్లో దావూద్ పాత్ర ఉంది.
నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు చెందిన ఒసామా బిన్ లాడెన్, అమాన్ అల్-జవహిరీలతో కూడా దావూద్ ఇబ్రహీం సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. దావూద్ ఇబ్రహీంకు యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియాలో విస్తరించి ఉన్న డజనుకు పైగా దేశాల్లో ఆస్తులున్నాయి. ఒక్క బ్రిటన్‌లోనే అతని ఆస్తుల విలువ 450 మిలియన్ డాలర్లు. అలాగే ప్రపంచ దేశాల్లో 50కి పైగా ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఇతని వ్యాపారం భారత్, పాకిస్థాన్, బ్రిటన్, జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో, సైప్రస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ దేశాలకు విస్తరించి ఉంది.


Click it and Unblock the Notifications