Jamsetji Tata: కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపారాలతో అనేక కోట్లను ఆర్జిస్తూ ఉంటాయి. అయితే వాటిలో తిలిగి సమాజ హితం కోసం ఎంత ఖర్చు చేస్తున్నాయనేది ముఖ్యం. ఏదో పన్ను తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు సీఎస్ఆర్ కింద నిధులు వెచ్చిస్తుంటాయి. కానీ ఈయన వాటికి భిన్నం..
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సెట్జీ నుస్సర్వాన్‌జీ టాటా గత శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యధిక విరాళాలు అందించిన వ్యక్తిగా నిలిచారు. ఆయన 102.4 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8,29,734 కోట్లు దాతృత్వానికి వెచ్చించారని ఎడెల్‌గివ్ ఫౌండేషన్ అండ్ హురున్ రిపోర్ట్ వెల్లడించింది. రెండవ స్థానంలో బిల్ గేట్స్ నిలవగా.. మూడో స్థానంలో వారెన్ బఫెట్ ఉన్నారు. ఇవి ద్రవ్యోల్బణం కోసం ఆస్తుల విలువను సర్దుబాటు చేసిన తర్వాత లెక్కించబడింది.

జామ్‌సెట్జీ టాటా విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో అత్యధిక విరాళాలను అందించారు. 1892లోనే జామ్‌సెట్జీ తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. టాటాతో పాటు టాప్-50 ప్రపంచ దాతృత్వ జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడు విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ. ఈయన 22 బిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. ప్రేమ్‌జీ 67 శాతం విప్రో షేర్లను అజీమ్ ప్రేమ్‌జీ ఎండోమెంట్ ఫండ్‌కు అందించారు. అలాగే 2001లో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు మద్దగా నిలిచారు.
1904లో జామ్‌సెట్జీ టాటా తుది శ్వాస విడిచిన తర్వాత.. టాటా గ్రూప్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా ప్రస్తుతం టాటా గ్రూప్ దాతృత్వ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆధునిక బిలియనీర్లుగా ప్రపంచ కుబేరుల జాబితాలో ముందు వరుసలో ఉన్న ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ పేర్లు జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఛారిటీ చేస్తున్న టాప్-50 మందిలో 39 మంది బిలియనీర్‌లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, యూకే నుంచి ఐదుగురు, చైనా నుంచి ముగ్గురు, భారత్ నుంచి ఇద్దరు, పోర్చుగల్-స్విట్జర్లాండ్‌ల నుంచి ఒక్కొక్కరు ఈ జాబితాలో ఉన్నారు.


Click it and Unblock the Notifications