స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు (సోమవారం, మార్చి 23) ఓ దశలో సెన్సెక్స్ 10 శాతం నష్టపోవడంతో 45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేశారు. ఉదయం సెన్సెక్స్ 2600 పాయింట్ల నష్టాలతో ప్రారంభమైంది. మధ్యాహ్నం 3500 పాయింట్ల నష్టంతో ఉంది.
స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులను అరికట్టేందుకు ఎక్సేంజీలు మూడు దశల సర్క్యూట్స్‌ను ఏర్పాటు చేశాయి. 10 శాతం, 15 శాతం, 20 శాతంగా ఉంటాయి. ఈ దశలకు చేరుకుంటే మార్కెట్లను నిర్ణయించిన ప్రకారం నిలిపివేస్తారు.

10 శాతం పడిపోతే..
బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈలో గత ముగింపుతో 10 లేదా 15 లేదా 20 శాతం చొప్పున క్షీణిస్తే సర్క్యూట్ బ్రేకర్లు ట్రిగ్గర్ అవుతాయి. దీంతో ట్రేడింగ్ ఆపేస్తారు. మధ్యాహ్నం గం.1 లోపు 10 శాతం పడిపోతే 45 నిమిషాలు, మధ్యాహ్నం ఒకటిన్నర నుండి రెండున్నర మధ్య 10 శాతం క్షీణిస్తే 15 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేస్తారు. ఆ తర్వాత యథావిథిగా ఉంటుంది. మధ్యాహ్నం రెండున్నర తర్వాత పది శాతం క్షీణించినా ట్రేడింగ్ ఆగదు.

15 శాతం పడిపోతే..
మధ్యాహ్నం ఒకటి లోపు సూచీలు 15 శాతం నష్టపోతే గం.1.45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేస్తారు. మధ్యాహ్నం గం.1 నుండి గం.2 మధ్య 15 శాతం నష్టపోతే ఆ రోజుకు పూర్తిగా ట్రేడింగ్ నిలిపివేస్తారు.

20 శాతం పడిపోతే..
ఏదైనా ఓ రోజులో 20 శాతం ట్రేడింగ్ పడిపోతే మాత్రం ఆ తర్వాత మిగిలిన రోజంతా ట్రేడింగ్ నిలిపివేస్తారు. ఈ రోజు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ 45 నిమిషాల పాటు నిలిచిపోయింది. మార్కెట్లు ఓపెన్ అయిన గంటలోనే నిలిచిపోయాయి.

మార్కెట్ నిలిపివేత ఉపయోగకరం
లోయర్ సర్క్యూట్ చేరుకుంటే మార్కెట్లో ట్రేడింగ్ నిలిపివేస్తారు. ఇలా నిలిపివేయడానికి కారణం ఉంది. ఇలాంటి ఒత్తిడి సమయంలో ఇన్వెస్టర్లను ప్రొటక్ట్ చేసేందుకు నిలిపివేస్తారు. డబ్బుతో ముడివడిన అంశం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి నుండి బయటపడేసేందుకు ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications