IPO News: ఐపీవో ధరకంటే తక్కువకు ట్రేడవుతున్న 8 స్టాక్స్.. ఎల్ఐసీ ఇన్వెస్టర్ల పరిస్థితి..!!
IPO's Crash: కరోనాకి కొంత కాలం ముందర మార్కెట్లోకి చాలా స్టార్టప్ కంపెనీలు తమ ఐపీవోలను ప్రవేశపెట్టాయి. అప్పట్లో ఇన్వెస్టర్లు సైతం వాటిని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపారు. కానీ ఇప్పుడు బొమ్మ రివర్స్ అయ్యింది.
అయితే 2023లో జూలై మాసంలో మార్కెట్లోకి వచ్చిన ఐపీవోలు మాత్రం ఇన్వెస్టర్లను తొలిరోజు నుంటే ధనవంతులుగా మార్చేస్తున్నాయి. ఉదాహరణకు నిన్న మార్కెట్లోకి వచ్చిన నెట్‌వెబ్ టెక్నాలజీస్ 90 శాతం, ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా లిస్టింగ్‌లో 50 శాతం లాభాలను అందించి ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. కానీ కొన్ని ఐపీవోల్లో పెట్టుబడిపెట్టి నష్టపోయినవారు.. ఇటీవలి ర్యాలీలో స్టాక్స్ ఇష్యూ ధరలను అధిగమిస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఎనిమిది కంపెనీల షేర్లు వాటి ఇష్యూ ధర కంటే తక్కువకు ట్రేడ్ జరగటం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేస్తున్నట్లు డేటా చెబుతోంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగిన కంపెనీ ఇన్సూరెన్స్ దిగ్గజం LIC. దీని ఇష్యూ ధర రూ.949 ఉండగా.. ప్రస్తుతం 33 శాతం తక్కువలో రూ.630 వద్ద ట్రేడవుతోంది. అలాగే లాజిస్టిక్స్ సంస్థ ఢెలివెరీ రూ.487 ఇష్యూ ధరతో పోలిస్తే 17 శాతంపైగా క్షీణించి రూ.401.05 వద్ద కొనసాగుతోంది. ఆదాయాల పరంగా కంపెనీ దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న లాజిస్టిక్స్ సేవల సంస్థగా కొనసాగుతోంది. దీనికి ఐసీఐసీఐ రూ.500 టార్గెట్ ధరతో బై రేటింగ్ కొనసాగిస్తోంది.
ఇదే క్రమంలో జనవరి 2022లో లిస్ట్ అయిన AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ల ఇష్యూ ధర రూ.175తో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 68 శాతం తగ్గి రూ.56.30 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అలాగే ఉమా ఎక్స్‌పోర్ట్స్ ఇష్యూ ధర కంటే 16 శాతం, ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా షేర్లు ఇష్యూ రేటు కంటే 15 శాతం తక్కువలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో ఎలిన్ ఎలక్ట్రానిక్స్ కూడా దాదాపు 41 శాతం క్షీణించి రూ.146.30 వద్ద, ధర్మజ్ కార్ప్ గార్ ఇష్యూ ధర కంటే 28 శాతం తక్కువగా రూ.171 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీ షేర్ల ఐపీవోలో పాల్గొని పెట్టుబడులు పెట్టి కొనసాగిస్తున్న ఇన్వెస్టర్లు కనీసం అసలు మెుత్తాన్నైనా తిరిగి పొందాలని కోరుకుంటున్నారు.
FY23 చివరి నాటికి పాలసీలు, ప్రీమియంలలో వరుసగా 71.26 శాతం, 62.58 శాతం మార్కెట్ వాటాను ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ కలిగి ఉంది. అయితే వాస్తవం కంటే అధిక వ్యాల్యూయేషన్లకు స్టాక్ అమ్మటం వల్లే కోలుకోలేకపోతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో ఎల్ఐసీ కింద దాదాపు రూ.40 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు నిర్వహణలో ఉన్నాయి. చాలా మంది తమ పెట్టుబడులను ఇందులో ఉంచారు. రానున్న 9-12 నెలల్లో షేర్ ధర రూ.805కి చేరుకుంటుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications