Deadline: సెప్టెంబర్ 30లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేకుంటే మీకే నష్టం..
ప్రస్తుతం మనం సెప్టెంబర్ నెల మధ్యలో ఉన్నాం. మరో రెండు వారాల్లో నెల ముగియనుంది. అయితే ఈ క్రమంలో నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఉన్నాయని గుర్తుంచుకోండి. సకాలంలో వీటిని పూర్తి చేయకపోతే ఆర్థికంగా మీరే నష్టపోతారు.
ముందుగా పూర్తి చేయాల్సిన విషయం ఆధార్ కార్డుకు సంబంధించినది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్(SCSS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC), ఇతర పోస్టాఫీసు సేవింగ్ వంచి పొదుపు పథకాల్లో డబ్బు పెట్టినవారు సెప్టెంబర్ 30లోపు ఆధార్ వివరాలు తప్పక అందించాల్సి ఉంటుంది. అలా చేయటంలో విఫలమైతే అక్టోబర్ 1 నుంచి సదరు కస్టమర్ల ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని గుర్తుంచుకోండి.

ఇక రెండవది ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ అందిస్తున్న WeCare గురించే. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్ కస్టమర్లకు సాధారణ రేటుకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు అంటే 100 బేసిస్ పాయింట్ల వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. పథకం కింద బ్యాంక్ తన ఖాతాదారులకు 7.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అయితే దీనిలో పెట్టుబడి పెట్టేందుకు చివరి తేదీ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుందని గుర్తుంచుకోండి.
ఇక పెట్టుబడిదారులు త్వరపడాల్సిన మరొకటి ఐడిఎఫ్‌సి ప్రత్యేక FD పథకం. బ్యాంక్ తీసుకొచ్చిన 375 రోజుల అమృత్ మహోత్సవ్ డిపాజిట్ స్కీమ్ కింద సాధారణ కస్టమర్లకు 7.10% వడ్డీని మరియు సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.60% వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇదే క్రమంలో 444 రోజులకు సాధారణ కస్టమర్లకు 7.15 శాతం వడ్డీని మరియు సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.65 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అయితే ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేసేందుకు చివరి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. దీనిని ఇన్వెస్టర్లు సద్వినియోగం చేసుకోవాలి.
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ ఖాతాల విషయంలో నామినీ వివరాలను సెప్టెంబర్ 30 నాటికి అందించాల్సి ఉంటుంది. గతంలో ఇందుకు మార్చి 31 వరకు ఉన్న గడువును సెబీ పొడిగించిన సంగతి తెలిసిందే. ఇక చివరగా రూ.2000 నోట్లు కలిగి ఉన్న వారు వాటిని రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోపు మార్చుకోవాల్సి ఉంటుంది. చలామణి నుంచి వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు నాలుగు నెలల కిందట ఆర్బీఐ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications