Akshaya Tritiya: అక్షయతృతీయకు గోల్డ్ కొంటున్నారా..? నకిలీ ఆభరణాలను గుర్తించండిలా
Gold News: మే 10న అక్షయతృతీయ వస్తోంది. ఎక్కువ మంది భారతీయులు జరుపుకునే పండుగ ఇది. ఈ రోజు చాలా మంది కనీసం ఒక్క గ్రామైనా బంగారం కొనాలని చూస్తుంటారు. అసలే ఒకపక్క పసిడి ధరలు ఆకాశానికి చేరుకోగా.. మరోపక్క నకిలీ బంగారంపై ప్రజల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
బంగారు ఆభరణాల దుకాణాలకు మహిళలు ఈరోజున అధిక సంఖ్యలో క్యూకడుతుంటారు. ఈ హడావిడిని కొందరు పసిడి వ్యాపారులు క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని అంటగడుతుంటారు. అయితే కొన్నాళ్ల తర్వాత వినియోగదారులు వీటిని మార్చుకోవాలని ప్రయత్నించినప్పుడు అసలు బండారం బయటపడుతుంది. అందుకే బంగారం కొనుగోలు విషయంలో గుడ్డి నమ్మకం పనికిరాదని గుర్తుంచుకోండి.

ఇలాంటి పొరపాట్లలో చిక్కుకోకుండా ఉండాలంటే పసిడి ఆభరణాలు కొనేటప్పుడు పాటించాల్సిన కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది అయితే దీని మృదుత్వం కారణంగా ఆభరణాలను తయారు చేసేందుకు సరైనది కాదు. అందుకే వీటిలో ఇతర లోహాలను కలిపి 22 క్యారెట్లు అంటే 91.6 స్వచ్ఛమైన గోల్డ్ కొనుక్కోవాలి. దీనిని 916 కేడీఎం బంగారం అంటుంటారు. బంగారం కొనేటప్పుడు భారత ప్రభుత్వ నిర్థేశాల ప్రకారం నాణ్యతను ధృవీకరిస్తూ హాల్‌మార్కింగ్ ఇస్తున్న షాపుల్లో మాత్రమే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయటం ఉత్తమం.
బంగారం నాణ్యతను పరీక్షించేందుకు 4 మార్గాలు..
వెనిగర్ టెస్ట్: మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలకు రెండు చుక్కల వెనిగర్ వేసి 5-10 నిమిషాలు ఆగండి. అవి రంగు మారితే కల్తీ బంగారం, మారకుండా ఉంటే అది స్వచ్ఛమైన బంగారమని గుర్తుంచుకోండి.
యాసిడ్ టెస్ట్: బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇది నమ్మదగిన పరీక్ష. దీనికి హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఒక రాయి అవసరం. రాయిపై కొంత బంగారాన్ని రుద్ది దానికి యాసిడ్ జోడించండి. బంగారం కాకుండా మరేదైనా లోకం అందులో కలిస్తే అది యాసిడ్‌లో కరిగిపోతుంది. అయితే ఈ పరీక్ష చేయటం ఇంట్లో కుదరదని గుర్తుంచుకోండి. దీనిని మీకు సమీపంలోని బంగారు దుకాణదారుని వల్ల పరిశీలించటం ఉత్తమం.
నీటి పరీక్ష: బంగారంలోని పరమాణువులు ఒకదానితో ఒకటి అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి అది నీటిలో తేలదు. ఏదైనా ఇతర లోహం ఎక్కువ మొత్తంలో కలిపితే, బంగారం నీటిలో తేలుతుంది. ఇలా కూడా మీరు బంగారం నాణ్యతను పరీక్షించవచ్చు.
అయస్కాంత పరీక్ష: సాధారణంగా అన్ని లోహాలు అయస్కాంతం దగ్గర ఉంచినప్పుడు ఆకర్షితులవుతాయి. అయితే బంగారం విషయంలో అలా ఉండదు. అందువల్ల మీ బంగారాన్ని అయస్కాంతానికి దగ్గరగా ఉంచినప్పుడు నకిలీ లేదా కల్తీ బంగారం ఉన్నట్లయితే అది ఆకర్షించబడుతుంది. ఇలాంటి చిన్న టెక్నిక్స్ వాడటం ద్వారా ఎవరైనా సులభంగా వారు కొనుగోలు చేసిన పసిడి క్వాలిటీని పరీక్షించవచ్చు.


Click it and Unblock the Notifications