ఏపీ నుండి తమిళనాడుకు ప్లాంట్ తరలింపు నిజమా? కియా మోటార్స్ ఏం చెబుతోంది?
రాయలసీమ ప్రాంతానికి గత టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక కియా ప్రాజెక్టు అనంతపురం నుంచి తమిళనాడుకు వెళ్ళిపోతోందా? ఈ మేరకు నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ప్లాంటును తమిళనాడుకు తరలించేందుకు అక్కడి అధికారులతో కియా యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లుగా కథనాలు రావడం కలకలం రేపాయి. దీనిపై అధికార వైసీపీ ప్రభుత్వం, కియా యాజమాన్యం స్పందించింది.

అంతా వట్టిదే
దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా గురువారం తరలింపు వార్తలను కొట్టి పారేసింది. 1.1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ ప్లాంటును అనంతపురం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవాలని చెబుతోంది.

ఆశ్చర్యానికి గురి చేశాయి
మీడియాలో వస్తున్న కథనాలు ఆశ్చర్యానికి గురి చేశాయని, ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్లాంట్ సమర్థవంతంగా నడుస్తోందని, కానీ ఊహాజనిత వార్తలు, ప్రచారాలు రావడం సరికాదని కియా మోటార్స్ ఇండియా (సేల్స్, మార్కెటింగ్) హెడ్ మనోహర్ భట్ అన్నారు.

దీని వెనుక ఎవరున్నారో తెలియదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని, తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, తమ అధికారు పేరుతో ఇలాంటి కథనాలు సరికాదని, ఇవి వరస్ట్ ఊహాజనిత వార్తలని, ఇది తమను ఆశ్చర్యానికి గురి చేశాయని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలియదన్నారు.

అసలేం జరిగింది?
కియా పరిశ్రమను తరలించేందుకు యాజమాన్యం... తమిళనాడుతో చర్చిస్తున్నట్లగా వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో పారిశ్రామిక రాయితీలపై, ప్రభుత్వం పునరాలోచన చేయటమే తరలింపుకు కారణమని కథనంలో పేర్కొంటున్నారు. కియాకు నాటి టీడీపీ ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చింది. కియా కోసం పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చివరకు ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు కియ మొగ్గు చూపింది. ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి లబ్ధి చేకూరుతుంది.

స్థానికులకు ఉద్యోగాలు
కియా పరిశ్రమల రాయితీలతో పాటు పలు అంశాలు ఆ కంపెనీకి ఇబ్బందికరంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కియా అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు. అయితే అసంతృప్తి వేరు.. పరిశ్రమ తరలింపు వేరు అని, ప్లాంట్ తరలింపు అవాస్తవమని అంటున్నారు.


Click it and Unblock the Notifications