GST News: వచ్చే GST కౌన్సిల్ మీటింగ్‌లో కీలక నిర్ణయం.. చిన్న వ్యాపారులపై పెద్ద భారం
Small value transactions: కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో జరగబోయే GST కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్న లావాదేవీల విషయంలో చెల్లింపు అగ్రిగేటర్లపై 18 శాతం పన్ను విధించడాన్ని GST కౌన్సిల్ పరిగణలోనికి తీసుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ అగ్రిగేటర్‌లు లావాదేవీలకు మధ్యవర్తులుగా పనిచేస్తాయని, అందువల్ల వాటిని బ్యాంకులుగా వర్గీకరించకూడదనే అభిప్రాయాన్ని కౌన్సిల్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
దీంతో 2 వేల వరకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకుగాను 'బిల్ డెస్క్' మరియు 'సీసీ ఎవెన్యూ' వంటి సంస్థలు ఇకపై 18% GST
చెల్లించాల్సి రావచ్చు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం చెల్లింపు అగ్రిగేటర్లు ప్రస్తుతం 2 వేల కంటే తక్కువ మొత్తంలో లావాదేవీలపై GST నుంచి మినహాయించబడ్డారు. అయితే ఫిట్‌మెంట్ కమిటీ ఈ చెల్లింపు అగ్రిగేటర్లపై (PAs) GST విధించడం వైపు మొగ్గు చూపుతుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 80 శాతం కంటే ఎక్కువ 2 వేల కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలే ఉన్నాయి. 2016లో డీమోనిటైజేషన్ సమయంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, PAలు ఈ లావాదేవీలపై వ్యాపారులకు పన్ను విధించడం మానేశారు.
2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే వచ్చే GST కౌన్సిల్ సమావేశం అనంతరం ఈ వ్యవహారంపై స్పష్టత లభిస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. చెల్లింపు అగ్రిగేటర్లు ప్రస్తుతం వ్యాపారుల నుంచి లావాదేవీకి 0.5-2 శాతం వరకు రుసుము వసూలు చేస్తున్నాయి. GST విధింపు వలన ఈ అదనపు ఖర్చు వ్యాపారులపై పడనుంది.


Click it and Unblock the Notifications