Padmanadha Swamy Temple: పన్ను నోటీసులు సాధారణంగా వ్యాపారవేత్తలకు రావటం లేదా వ్యాపార సంస్థలకు రావటం వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం దేశంలోని ఒక ప్రసిద్ధ ఆలయానికి జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులు అందుకోవటంపై భక్తులు ఔరా అంటున్నారు.
కేరళ తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ ఆలయం పన్ను అధికారుల కన్ను పడింది. ఈ క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ నుంచి రూ.1.5 కోట్ల బకాయి జీఎస్టీని డిమాండ్ చేస్తూ సెంట్రల్ జీఎస్టీ నుంచి నోటీసులు వచ్చాయి. అయితే ఈ బకాయి ఇప్పటిది కాదని, దాదాపు 7 ఏళ్లుగా పెండింగ్ జీఎస్టీ మెుత్తం రూ.1.57 కోట్ల విషయంలో తాజాగా నోటీసులు ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఆలయ అధికారులు ఇస్తున్న వివరణను పన్ను శాఖ తిరస్కరించటంతో సమస్య పరిష్కారం కాలేదు. వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంపై ఆలయ నిర్వహణ కమిటీ జీఎస్టీని చెల్లించడం లేదని నోటీసుల జారీ ద్వారా వెల్లడైంది.

జీఎస్టీ పెండింగ్ వివాదంలో ఆలయానికి అద్దె నుంచి వచ్చిన ఆదాయం. భక్తులకు ఇచ్చే దుస్తులు, పద్మనాభస్వామి ఫొటోలు, ఊరేగింపులకు ఏనుగులను అద్దెకు తీసుకోవడం వంటి అంశాలున్నాయి. దీనిపై మీడియా ముఖంగా క్లారిటీ ఇస్తూ తాము సెంట్రల్ జీఎస్టీ అధికారులకు నోటీసులపై తమ వాదనను తెలియజేస్తామని బోర్డ్ ప్రకటించింది. మథిలకం కార్యాలయంలో తనిఖీల్లో ఆలయ కమిటీ వివిధ సేవలపై భక్తుల నుంచి పన్ను వసూలు చేసిందని అయితే దానిని తమ వద్ద డిపాజిట్ చేయలేదని తేలినట్లు జీఎస్టీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. కానీ.. పద్మనాభస్వామి ఆలయ కమిటీ మాత్రం తాము రూ.1.5 కోట్లు చెల్లించక్కర్లేదని.. చట్టపరంగా వచ్చే వివిధ రాయితీల అనంతరం రూ.16 లక్షలు మాత్రమే మిగిలాయని చెబుతోంది.
జీఎస్టీ అధికారులు మాత్రం ఆలయ కమిటీ చెల్లింపు నిరాకరణపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. తాము నోటీసుల్లో పేర్కొన్న రూ.1.57 కోట్ల బకాయి చెల్లించకపోతే దీనిపై చట్టపరంగా తాము 100 శాతం పెనాల్టీతో పాటు అదనంగా 18 శాతం వడ్డీ చెల్లించాలని తాజా నోటీసుల్లో పేర్కొంది. దీనికి ముందు సైతం కేరళలోని అనంతపద్మనాభ స్వామి దేవాలయం అనేక మార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం మెుదటి స్థానంలో ఉండగా.. పద్మనాభస్వామి దేవాలయం రెండవ ధనిక ఆలయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆలయం కింద ఉన్న 6 సొరంగాల్లో దాదాపు 20 బిలియన్ డాలర్లుగా ఉందని తెలింది.


Click it and Unblock the Notifications