UAE Lottery: టైమ్ వస్తే లచ్చిందేవి తలుపు తడుతుందంటే ఇదే మరి. పొట్టకూటి కోసం యూఏఈకి వెళ్లిన కొందరి తలరాతను లాటరీ మార్చేస్తోంది.
ఈ క్రమంలోనే కేరళ, ముంబైకి చెందిన వ్యక్తులు తాజాగా యూఏఈలో ధనవంతులుగా మారిపోయారు. పెద్ద మెుత్తంలో దుబాయ్, అరబ్ దేశాలకు వెళ్లే భారతీయులు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు అక్కడ లాటరీలు కొంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది జీవితాలు పూర్తిగా మారిపోయాయి. తాజాగా కేరళకు చెందిన శ్రీజు అనే వ్యక్తి ఏకంగా రూ.45 కోట్లను పొందటం సంచలనంగా మారింది.

UAE 'జస్ట్ సాటర్డే మిలియన్స్' లాటరీలో మొదటి బహుమతి AED 20,000,000ని సదరు వ్యక్తి గెలుచుకున్నాడు. 39 ఏళ్ల శ్రీజు దాదాపు 11 ఏళ్లుగా యూఏఈలోని ఫుజైరాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను పనిలో ఉండగా అతని ఖాతాలో డబ్బు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. విషయం తెలుసుకోగా బుధవారం ప్రకటించిన 154వ డ్లాలో విజేతగా నిలిచినట్లు తెలుసుకుని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ డబ్బుతో ఇండియాలో ఓ పెద్ద ఇల్లు కొనాలనే ఆలోచనలో శ్రీజు ఉన్నట్లు తెలుస్తోంది.
గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం కేరళకు చెందిన మరొకరు గత శనివారం 'ఎమిరేట్స్ డ్రా ఫాస్ట్5'లో దాదాపు రూ.11 లక్షల విలువైన బహుమతిని గెలుచుకున్నారు. అంతకుముందు నవంబర్ 9న ముంబైకి చెందిన 42 ఏళ్ల మనోజ్ భావ్‌సర్ ఫాస్ట్ 5 లాటరీలో దాదాపు రూ.16 లక్షలు గెలుచుకున్నాడు. నవంబర్ 8న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన 'దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్' ప్రమోషన్‌లో అనిల్ జియాంచందానీ 1 మిలియన్ US డాలర్లను గెలుచుకున్నట్లు వెల్లడైంది. ఇలా అనేక మంది భారతీయుల జీవితాలను లాటరీ మార్చేసింది.


Click it and Unblock the Notifications