IT News: కర్ణాటకలో జరుగుతున్న వరుస పరిణామాలు అక్కడ పనిచేస్తున్న టెక్కీలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. గడచిన వారంలో కర్ణాటక ప్రభుత్వం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ చేసిన చట్టంపై అనేక పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధానంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న టెక్కీలు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలికంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
అయితే ఇప్పుడు కర్ణాటకలో పనిచేస్తున్న ఉద్యోగుల మెడకు కొత్త సమస్య చుట్టుకుంది. ఉద్యోగుల పని వేళలను 14 గంటలకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలోని ఐటీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ చర్య ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ చర్య తమ ఆరోగ్యాన్ని క్షీణింపచేయటంతో పాటు లేఆఫ్స్ కు దారితీస్తుందని టెక్కీలు ఆవేదన చెందుతున్నారు. ఇది అమానుషంగా వారు భావిస్తున్నారు.

మూలాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్- 1961ని సవరించడాన్ని పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఐటి కంపెనీలు తమ ప్రతిపాదనను సవరణలో చేర్చాలని కోరుతున్నాయి. ఇది చట్టబద్ధంగా పని గంటలను 14 గంటలకు పొడిగిస్తుందని సమాచారం. 14 గంటల పని వేళలో 12 గంటల పనిసమయంతో పాటు 2 గంటల ఓవర్‌టైమ్ ఉండనుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కార్మిక చట్టాల్లోని 12 గంటల్లో 10 గంటలు పని సమయంగా ఉండగా 2 గంటలు ఓవర్ టైమ్ వేళలు అమలులో ఉన్నాయి.
IT రంగం కొత్త ప్రతిపాదన ప్రకారం IT/ITeS/BPO రంగంలోని ఉద్యోగులు రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. మూడు నిరంతర నెలల్లో 125 గంటలకు మించకూడదు. ఈ విషయంపై ప్రభుత్వం ప్రాథమిక సమావేశం నిర్వహించిందని, ఈ ప్రతిపాదనలపై నిర్ణయాలు త్వరలో తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే దీనిపై మంత్రివర్గ సమావేశంలో సైతం చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారతదేశ టెక్ పరిశ్రమలో సిలికాన్ వ్యాలీగా పేరొందిన కర్ణాటక బెంగళూరు నగరం ప్రస్తుతం పెద్ద కుదుపులకు గురవుతోంది.

పని గంటల పొడిగింపు చర్యకు కర్ణాటక రాష్ట్ర IT/ITeS ఉద్యోగుల సంఘం(KITU) నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. వర్కింగ్ షిఫ్టుల సంఖ్యను తగ్గించడం వల్ల మూడింట ఒక వంతు మంది శ్రామికశక్తికి దూరంగా ఉంటారని హెచ్చరిస్తూ యూనియన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐటీ ఉద్యోగుల్లో పని గంటలు పొడిగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలపై అధ్యయనాలను యూనియన్ ఎత్తి చూపింది. అలాగే ఐటీ రంగంలోని 45% మంది ఉద్యోగులు డిప్రెషన్, 55% మంది శారీరక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు నివేదించింది. ఒకవేళ పనిగంటలు పొడిగిస్తే ఈ పరిస్థితి మరింత దిగజారుతుందని కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో ఉద్యోగులను మనుషులుగా కాకుండా యంత్రాలుగా చూస్తున్నారని ఉద్యోగుల సంఘం ఆరోపిస్తూ, ఐటీ సంస్థల డిమాండ్‌ను అమలు చేయకుండా సిద్ధరామయ్య ప్రభుత్వం పునరాలోచించాలని కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది.


Click it and Unblock the Notifications