భారీ డిస్కౌంట్‌తో డెమో కారు కొన్న వ్యక్తికి RTO షాక్.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..
కొత్త కారును భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవాలనే ఆశ..ఓ వ్యక్తిని అనూహ్యమైన చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టింది. బెంగళూరుకు చెందిన రామ అనే వ్యక్తి, 2021 మోడల్‌కు చెందిన ఒక డెమో కారును డీలర్ వద్ద నుండి భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేశారు. ఆ కారు గతంలో ఒకసారి రిజిస్టర్ అయ్యి, కొనుగోలుదారుడు వెనక్కి ఇచ్చేయడం వల్ల అది డెమో కారుగా మారిందని డీలర్ వివరించారు. అంతా సవ్యంగానే ఉందని భావించి సెప్టెంబర్ 2025లో ఆ కారును కొన్న రామకు, కొద్ది రోజులకే ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.
ఫిబ్రవరి 2026లో రామ తన ఇంట్లో లేని సమయంలో.. ఒక ప్రాంతీయ రవాణా అధికారి (RTO) తన సిబ్బందితో కలిసి ఆయన నివాసంలోకి ప్రవేశించారు. ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, యజమాని అనుమతి తీసుకోకుండా గ్యారేజీలో ఉన్న కారును బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా, సదరు అధికారి స్వయంగా కారును నడుపుకుంటూ వెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో రామపై ఫోర్జరీ, మోసం, ప్రభుత్వానికి సుమారు రూ. 60 లక్షల రోడ్డు పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కారు రిజిస్ట్రేషన్ డేటాను సాఫ్ట్‌వేర్‌లో తారుమారు చేశారని అధికారులు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

తన కారును ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియని స్థితిలో ఉన్న రామ, న్యాయం కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎం. నాగప్రసన్న, RTO అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను బకాయిలు ఉన్నాయని భావిస్తే చట్టప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ కోరాలి తప్ప.. ఒక పౌరుడి ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా వాహనాన్ని సీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ఒక అధికారి తన ఇష్టానుసారం ప్రవర్తించడం పౌర హక్కులను కాలరాయడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చివరికి కోర్టు బాధితుడికి ఊరటనిస్తూ కీలక తీర్పు వెలువరించింది. రామపై నమోదైన FIRను తక్షణం రద్దు చేయాలని ఆదేశించడమే కాకుండా, వారం రోజుల్లోగా కారును ఆయనకు అప్పగించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించిన సదరు RTO అధికారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ రికార్డుల్లో డేటా ఎలా మాయమైందనే అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ తీర్పు సామాన్య వాహనదారులకు పెద్ద ఊరటనివ్వడమే కాకుండా, అధికారుల బాధ్యతాయుత ప్రవర్తనకు ఒక హెచ్చరికగా నిలిచింది.


Click it and Unblock the Notifications
