Bengaluru News: కర్ణాటక ప్రజలకు టాక్సీ షాక్.. ఛార్జీలు పెంచుతూ సంచలన నిర్ణయం..
Karnataka News: ప్రస్తుతం కర్ణాటకలో రవాణా వ్యవస్థలో అనేక సంచలనాలు కొనసాగుతున్నాయి. ఒకపక్క అక్కడి ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా ఇవ్వటంతో ఆటోవాలాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు కర్ణాటకలో టాక్సీల టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం సిటీ టాక్సీలు, ఓలా, ఉబెర్ వంటి అగ్రిగేటర్ల క్రింద నడిచే వాహనాల ఛార్జీలను పెంచింది. వాహనాల ధర ఆధారంగా ట్యాక్సీ వాహనాలను ఇప్పుడు మూడు కేటగిరీల్లో వర్గీకరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చివరిసారిగా 2021లో నాన్-ఏసీ ట్యాక్సీలకు మొదటి 4కి.మీకి రూ.75, ఆ తర్వాత కిలోమీటరుకు రూ.18 చెల్లించే సమయంలో ఛార్జీలను సవరించింది. మునుపటి సవరణ ప్రకారం.. AC టాక్సీలు మొదటి 4 కి.మీకి రూ.100, ఆ తర్వాత కిలోమీటరుకు రూ.24గా ధరను నిర్ణయించారు.

తాజా రేట్లను పరిశీలిస్తే.. రూ.10 లక్షల వరకు ఖరీదు చేసే వాహనాలకు 4 కిలోమీటర్ల వరకు కనీస ధర రూ.100గా.. 4 కి.మీ తర్వాత ఒక్కో కిలోమీటరుకు రూ.24గా నిర్ణయించింది. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉండే వాహనాలకు కనిష్టంగా మొదటి 4 కి.మీకి రూ.115, అంతకు మించి కిలోమీటరుకు రూ.28గా నిర్ణయించారు. రూ.15 లక్షలకు పైబడిన వాహనాలకు మొదటి 4 కి.మీకి రూ.130, అదనంగా ఒక్కో కిలోమీటరుకు రూ.32 ఛార్జ్ చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం వెయిటింగ్ ఛార్జీలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదటి ఐదు నిమిషాలు ఉచితంగా ఉంచగా.. ఆ తర్వాత ప్రతి నిమిషానికి రూ.1గా నిర్ణయించబడింది. యాప్ ఆధారిత అగ్రిగేటర్లు 5 శాతం జీఎస్టీని సేకరిస్తాయి. అలాగే ప్రయాణీకుల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయవచ్చు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు సర్వీసు కార్యక్రమం కారణంగా గత కొన్ని నెలలుగా టాక్సీ డ్రైవర్లు తమ ఆదాయాలు పడిపోతున్నట్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నవేళ ధరల పెంపు ప్రతిపాదనతో ఊరటను కల్పించే ప్రయత్నాన్ని చేసింది.


Click it and Unblock the Notifications