రెండు అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకులు SBI, PNBకి కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొద్ది రోజుల క్రితం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు షాకిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వెంటనే రద్దు చేయాలని, ఇతర బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేయాలని స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని 15 రోజుల పాటు వాయిదా వేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రతినిధులు ప్రభుత్వం సమావేశం అయ్యి కాస్త సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అందుకే నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.
ఎస్‌బీఐ, పీఎన్‌బీలపై నిషేధం విధిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను 15 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బ్యాన్ నిర్ణయం తర్వాత, రెండు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆగస్టు 16న తమతో లిఖితపూర్వక ప్రతిస్పందనలను దాఖలు చేశాయని, సమస్యను పరిష్కరించడానికి 15 రోజుల సమయం కావాలని ప్రభుత్వాని కోరినట్లు పేర్కొంది. దీంతో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది.

బ్యాంకు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 15 రోజుల పాటు సర్క్యులర్‌ను కొనసాగించాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక ప్రభుత్వం 15 రోజుల సమయం పొందడం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనలను పరిష్కరించడానికి, ఈ విషయానికి పరిష్కారాన్ని కనుగొనడానికి రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగినంత సమయం లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం SBI, PNB వారి అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాల నుండి నిషేధించాలని నిర్ణయించింది.
అంతేకాకుండా, రెండు ప్రధాన ప్రభుత్వ బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్లన్నింటినీ ఉపసంహరించుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మోసం కారణంగా రెండు ప్రభుత్వ బ్యాంకులతో తమ సంబంధాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆగస్ట్ 12 ఓ ప్రకటన చేసింది. జూలై 2, ఆగస్టు 6 తేదీల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇచ్చిన పరిశీలనలు, కాగ్ నివేదికలోని ఆడిట్ ఫలితాల ఆధారంగా ఎస్‌బీఐ, పీఎన్‌బీలతో సంబంధాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. రెండు బ్యాంకుల్లోని అన్ని శాఖల్లోని ఖాతాలను మూసివేయాలని ప్రభుత్వం సర్క్యులర్‌లో అన్ని శాఖలను ఆదేశించింది.


Click it and Unblock the Notifications