బెంగళూరుకు బిగ్ షాక్.. ఐటీ హబ్‌గా కర్ణాటకలో మరో నగరం.. మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్న ప్రభుత్వం
బెంగళూరులో పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్న నేపధ్యంలో.. నగరానికి వెలుపల Bidadi లో మరో కొత్త ఐటీ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్. బిడది పరిసరాల్లో ఈ కొత్త ఐటీ సిటీని ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. సదాశివనగర్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన శివకుమార్.. ఇటీవలి కాలంలో అనేక దేశాల నాయకులు బెంగళూరును సందర్శించారని, బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. వారి పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
బెంగళూరు టెక్ సమ్మిట్ 2025 కి ప్రపంచంలోని 60 దేశాల ప్రతినిధులు హాజరుకాబోతున్నారని ఆయన వెల్లడించారు. కర్ణాటకలో ఉన్న ప్రతిభ, సాంకేతికత, స్టార్టప్ శక్తి ప్రపంచంలో ఏ ప్రాంతంతోనూ సరితూగదని.. యువతను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. రాష్ట్రానికి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడం, వాటిని ఉపయోగపడేలా చేయడం ప్రభుత్వ ధ్యేయమన్నారు.

బెంగళూరులో దాదాపు 25 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారని, ఇంత పెద్ద స్థాయి ఐటీ ప్రతిభ ప్రపంచంలో మరెక్కడా లేదని గర్వంగా పేర్కొన్నారు శివకుమార్. రాబోయే టెక్ సమ్మిట్ మూడు రోజుల పాటు ఐటీ భవిష్యత్తు, ఆవిష్కరణలు, టెక్నాలజీ దిశపై ప్రధాన చర్చలకు వేదికవుతుందని అన్నారు. ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, కియోనిక్స్ అధినేత శరత్ బచ్చే గౌడ చేస్తున్న పనిని ప్రశంసిస్తూ, వారి నేతృత్వంలో కర్ణాటక టెక్నాలజీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.
బెంగళూరులో రోడ్ల మరమ్మతులపై కొన్ని కంపెనీలు ప్రశంసలు తెలిపిన విషయం గురించి అడగగా.. ప్రభుత్వం విమర్శల్నీ, ప్రశంసలనూ సమానంగా స్వాగతిస్తుందని, ప్రజలకు సేవ చేయడమే తన ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇక మేకెదాతు ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును ఆయన స్వాగతించారు. ఇది ఎంతో ముఖ్యమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఈ కేసులో పని చేసిన న్యాయ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మరింత వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు రేపు మరో సమావేశం ఉన్నట్లు తెలిపారు.
మేకెదాతు ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడం, దీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర వివాదంలో కీలక మలుపు అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఇది రాష్ట్ర జలవనరుల నిర్వహణలో కర్ణాటక స్థానాన్ని మరింత బలపరుస్తుందని చెప్పారు. అంతేకాక, ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి జరిగిన సమావేశంపై ఊహాగానాలను తిప్పికొట్టారు. పూర్తిగా అభివృద్ధి పనులపై మాత్రమే చర్చ జరిగిందని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications