IT News: కర్ణాటక కొత్త GCC పాలసీ.. హైదరాబాదుకు దెబ్బే, తెలుగు టెక్కీల పరిస్థితి ఇదే..!!
Tech News: ఇటీవలి కాలంలో టెక్ రంగంలో కర్ణాటక కొంత వెనుకబడిందని చెప్పుకోక తప్పదు. ప్రపంచ కంపెనీలకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్‌గా మారిన క్రమంలో అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. అయితే దీనిని అడ్డుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మురం చేసినట్లు తాజా పరిణామాలు ద్వారా చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం దేశంలో మెుట్టమెుదటిసారిగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ కంపెనీల కోసం కొత్త పాలసీని ప్రవేశపెడుతోంది. అంతర్జాతీయ మెగా కంపెనీల కోసం ఈ ముసాయిదాను రూపొందించింది. టెక్ రంగంలోని అనేక జీసీసీ కంపెనీలు ఇండియాలో తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. కర్ణాటక ఈ పాలసీతో అందరినీ షాక్ కి గురిచేసింది. దీని ద్వారా జీసీసీ కేంద్రాల ఏర్పాటుకు బెంగళూరును మెుదటి ఎంపికగా మార్చటం ద్వారా కంపెనీలను ఆకర్షించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం చూస్తోంది.

ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం GCC పాలసీ 2024-2029ని రూపొందించింది. దీంతో దేశంలోనే తొలిసారిగా ఇలాంటి విధానాన్ని రూపొందించిన రాష్ట్రంగా కర్ణాటక ముందువరుసలో నిలిచింది. 2029 నాటికి రాష్ట్రంలో దాదాపు 500 జీసీసీ కేంద్రాలను ఆకర్షించే లక్ష్యంతో తాజా పాలసీ రూపొందించబడింది. ఈ చర్య టెక్ రంగంలో కొత్తగా 3.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని కర్ణాటక భావిస్తోంది. అలాగే రాష్ట్రానికి వచ్చే ఆదాయం సైతం దాదాపు 50 బిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని వెల్లడించింది. ఇప్పటికే జీసీసీ సెంటర్లు అత్యధికంగా 30 శాతం కర్ణాటకలో ఉన్నాయి. అయితే వీటి సంఖ్యను క్రమంగా 1000కి పెంచాలని పెంచాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఈ క్రమంలో తమ కార్యకలాపాలను కర్ణాటకలో ఏర్పాటుకు ఆసక్తి చూపే జీసీసీలకు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలను సైతం అందించటానికి సిద్ధమైంది. జీసీసీ సెంటర్లలో ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కూడా ఉంటాయని ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని జీసీసీ కేంద్రాల్లో ప్రస్తుతం 12 లక్షల మంది పనిచేస్తున్నారని, దీని ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారం 22.2 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించారు.
కర్ణాటక అభివృద్ధికి జీసీసీ కేంద్రాలు పెద్దపీట వేస్తాయని పేర్కొంటూ.. బెంగళూరు మినహా కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లోనూ జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని ఐటీ మంత్రి వెల్లడించారు. ఇది ఒక విధంగా తెలుగు టెక్కీలకు శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఇవి కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తాయి. అయితే జీసీసీల వ్యాపారంలో వేగంగా ముందుకు సాగుతున్న హైదరాబాద్ నగరానికి కర్ణాటక పాలసీ పెద్ద గండికొట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications