ప్రయాణికులకు బిగ్ షాక్..ఓలా, ఉబర్, రాపిడో సేవలు అక్కడ బంద్, కారణం ఏంటంటే..
కర్ణాటకలో ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. నేటి నుండి కర్ణాటకలో బైక్ టాక్సీలు బంద్ అయ్యాయి. మోటారు వాహనాల చట్టం కింద స్పష్టమైన నియమాలు రూపొందించే వరకు కర్ణాటక హైకోర్టు ఈ సేవలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఈ నిర్ణయంతో బెంగళూరు, కర్ణాటకలోని ఇతర నగరాల్లోని లక్షలాది మంది ప్రయాణికులకు జర్నీ సమస్యలు ఎదురుకానున్నాయి. రాపిడో, ఉబర్ మోటో వంటి ఆపరేటర్లకు పెద్ద ఎదురుదెబ్బ తగలినట్లైంది.
కర్ణాటక హైకోర్టు జూన్ 16, 2025 నాటికి రాష్ట్రంలో ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. ఓలా (ANI టెక్నాలజీస్), ఉబర్ ఇండియా సిస్టమ్స్, రాపిడో పిటిషన్లను విచారించిన తర్వాత ఈ ఉత్తర్వు ఇచ్చింది. ఈ కంపెనీలు తమ బైక్ టాక్సీ సేవకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

దీనితో పాటు, ఎల్లో నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను రవాణా వాహనాలుగా నమోదు చేసుకోవడానికి అనుమతించాలని పిటిషన్లో కోరాయి. మధ్యంతర ఉపశమనం కోసం కంపెనీలు వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. సరైన నియమాలు లేకుండా ఈ సేవలు చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.
పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బి.ఎం. శ్యామ్ ప్రసాద్ ధర్మాసనం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం కింద స్పష్టమైన మార్గదర్శకాలను అమలు చేసే వరకు, ఈ సేవలను రాష్ట్రంలో నిర్వహించబోమని పేర్కొంది. నియమాలను రూపొందించడానికి కోర్టు ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇచ్చింది.
2025 ఏప్రిల్‌లో కర్ణాటక హైకోర్టు బైక్ సేవలను అందించే ఈ కంపెనీలకు జూన్ 15 వరకు బైక్ టాక్సీ సేవలను కొనసాగించడానికి మధ్యంతర అనుమతి ఇచ్చింది. అయితే..కోర్టు ఇప్పుడు ఈ ఉపశమనాన్ని పొడిగించడానికి నిరాకరించింది. ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం 2021 సంవత్సరంలో ప్రారంభించింది, కానీ భద్రత, నియమాల లేకపోవడం వల్ల మార్చి 2024లో దీనిని ఉపసంహరించుకుంది.
కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలేంటి: బైకులను కమర్షియల్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలుగా వినియోగించ వద్దని సిద్ధరామయ్య సర్కారు..ర్యాపిడో, ఉబర్ లాంటి బైక్ ట్యాక్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే నేటి నుంచి రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బైక్ ట్యాక్సీలు హైకోర్టులో సవాల్ చేశాయి. అయితే హైకోర్టులో వాటికి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక రవాణాశాఖ రూల్స్ ప్రకారం.. టూ వీలర్స్ ను వాణిజ్య సేవలకు వినియోగించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను హైకోర్టు సమర్థించింది.
ఈ నిర్ణయంతో బెంగుళూరుతో పాటు కర్ణాటకలోని మిగతా నగరాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. వారు ఇప్పుడు సర్వీసు ఆటోలను లేదా ప్రభుత్వ ట్రాన్స్ పోర్టును వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక హైకోర్టు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపు లక్షల మందిని ప్రభావితం చేయనుంది. అటు ప్రయాణికులు, ఇటు ట్యాక్సీ డ్రైవర్లు, కంపెనీలు తీవ్రంగా నష్టపోనున్నారు.


Click it and Unblock the Notifications