Telangana: కంటి వెలుగు 2.0 సక్సెస్.. తెలంగాణలో 1.52 కోట్ల మందికి కంటి పరీక్షలు..
Kanti Velugu: తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కోసం చేపట్టిన ప్రజారోగ్య పథకంలో భాగంగా కొనసాగుతున్న రెండో దశలో ఇప్పటి వరకు 1.52 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించింది.
ఇప్పటి వరకు 21.66 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేసినట్లు తాజా అధికారిక ప్రకటన ద్వారా తెలుస్తోంది. 17.41 లక్షల మంది ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం రిఫర్ చేయగా.. 1.13 కోట్ల మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని తేలింది. "అవాయిడేబుల్ బ్లైండ్‌నెస్ ఫ్రీ తెలంగాణ" దిశగా కృషి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో అంధత్వాన్ని నివారించేందుకు ఉద్దేశించిన 'కంటి వెలుగు' పథకం రెండో దశను తెలంగాణ సీఎం కేసీఆర్ జనవరి 18న ప్రారంభించారు. ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌లో భాగంగా 1500 మంది కంటి వైద్యుల బృందం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తోంది. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారు కళ్లద్దాలను ఉచితంగా అందజేయటంతో పాటు కంటి జబ్బులకు మందులు అందజేస్తున్నారు.
రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారని 'కంటి వెలుగు' కార్యక్రమానికి సంబంధించిన అధికారులు వెల్లడించారు. దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోవటం అనేది ఒక సాధారణ వ్యాధి, మరికొందరిలో దగ్గరగా ఉండే వస్తువులు కనిపించవు.. ఇలాంటి వాటిని సరిచేసేందుకు వైద్యులను సంప్రదించటం ముఖ్యం.

40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు సాధారణంగా దగ్గరి వస్తువులు కనిపించటం లేదని కంటి చూపు మందగించిందని ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి సమస్యకు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు స్కీమ్ కింద వైద్యులు ప్రిస్క్రిప్షన్ మేరకు గ్లాసెస్ ఉచితంగా అందిస్తోంది. వీటితో పాటు విటమిన్ A, D, B కాంప్లెక్స్ మాత్రలను సైతం ప్రభుత్వం నిర్వహిస్తున్న శిబిరాల్లో అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications