ప్రాణాలతో ఉండాలంటే Air India విమానాలు ఎక్కొద్దు..!! పన్నున్ చివరి వార్నింగ్..
Kalistani Terrorist Pannun: ఒకపక్క భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే భారత్ కెనడియన్ దౌత్యవేత్తలను వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా తేల్చి చెప్పింది. కెనడా మాజీ రాయబారి కెమెరాన్ మెక్‌కే ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో నిజ్జర్ హత్య, పన్నున్ హత్యాయత్నం ఒకే కుట్రలో భాగమని, అవి దిల్లీ నుంచే ప్రారంభమయ్యాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవం సందర్భంగా ఖలిస్తానీ వేర్పాటువాది గురుపద్వాంత్ సింగ్ పనూన్ భారతీయ ప్రయాణికులకు భారీ హెచ్చరిక జారిచేశాడు. వచ్చే నెల 1 నుంచి 19 వరకు ఎవ్వరూ ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని హెచ్చరించాడు. వేర్పాటువాదం ముసుగులో ఉన్న ఉగ్రవాది ప్రస్తుతం కెనడా, యూఎస్ పౌరసత్వం కలిగి ఉన్నాడు. గత ఏడాది సైతం ఇదే సమయంలో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికలే జారీ చేశాడు.

మరోపక్క దేశంలో గడచిన కొన్ని వారాలుగా అనేక సంస్థలకు చెందిన విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు పెరిగిపోయాయి. ఈ వారంలోనే దాదాపు 100 విమానాలకు నకిలీ బెదిరింపులు రావటంతో ప్రయాణికులు ఇబ్బంది పడటంతో పాటు విమానయాన సంస్థలు సైతం భారీగా నష్టపోయాయి. గతవారం ఇండిగో, విస్తారా, ఆకాశా, ఎయిర్ ఇండియాలకు చెందిన కొన్ని విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే దాదాపు 6 విమానాలకు ఇలాంటి బెదిరింపులు రావటంతో భారీగా అంతరాయాలను దేశీయ విమానయాన ప్రయాణికులు ఎదుర్కొన్నారు. ఒకపక్క నిజ్జర్ హత్య విషయంలో కెనడా-ఇండియా మధ్య దౌత్యపరమైన ఘర్షన కొనసాగుతుండగా.. పన్నున్, నిజ్జర్లను ఇండియా ఉగ్రవాదులుగా ప్రకటించింది. అయితే ఒక ఇంటర్వ్యూలో నిజ్జర్ తనకు సన్నిహిత సహచరుడని, తమ్ముడు లాంటి వాడని ఒక ఇంటర్వ్యూలో పన్నున్ చెప్పాడు.
అసలు పన్నున్ కెనడా-అమెరికాకు పౌరుడుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అతను ప్రత్యేక సిక్కు రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ అనియంత్రిత ప్రజాభిప్రాయ సేకరణలో కీలక నిర్వాహకుడుగా కొనసాగుతున్నాడు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నందుకు భారతదేశం తనను చంపాలనుకుంటోందని, భారత అంతర్జాతీయ ఉగ్రవాదం అమెరికాకు సవాలుగా మారుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి ఈ పంజాబీ ఉగ్రవాది పన్నున్ అమృత్‌సర్ శివార్లలోని కాంకోట్ గ్రామంలో జన్మించాడు. అతను పంజాబ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డు మాజీ ఉద్యోగి మహిందర్ సింగ్ కుమారుడు. 1990లలో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన పన్నున్.. 2007లో సిక్కుల కోసం న్యాయాన్ని స్థాపించినట్లు కూడా చెబుతారు. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించినందుకు, పంజాబీ సిక్కు యువకులను ఆయుధాలు తీసుకునేలా ప్రోత్సహించినందుకు పన్నూన్ వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు.


Click it and Unblock the Notifications