రైల్వే ప్రయాణం సురక్షితంగా సాగాలంటే కేవలం ప్రయాణ టికెట్ మాత్రమే కాకుండా, ప్రయాణ బీమా కూడా అవసరం. అందుకే ఇప్పుడు ఈ-టికెట్ బుకింగ్ సమయంలో కేవలం 45 పైసలు చెల్లించి మీరు ఆ బీమా తీసుకోవచ్చు. ఎంతో తక్కువ ధరలో ఎంతో రక్షణ పొందే అవకాశం ఇది.

ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో తెలిపారు. ఈ బీమా యోజనను సుమారు అర్ధ రూపాయికే పొందవచ్చు. ఈ బీమా స్కీమ్ ప్రస్తుతం కేవలం ఆన్‌లైన్‌లో బుక్ చేసిన Confirmed లేదా RAC టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే కౌంటర్‌లో తీసుకునే టిక్కెట్లకు ఇది వర్తించదు.
టికెట్ బుక్ చేస్తున్న సమయంలోనే ప్రయాణికుడు ఈ బీమా స్కీమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఇష్టం ఉన్నవారు ఎంచుకోవచ్చు. ఈ బీమా తీసుకున్న ప్రయాణికుడికి ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగినపుడు ఆర్థిక రక్షణ లభిస్తుంది.
టికెట్ బుక్ అయిన తరువాత, ప్రయాణికుడికి బీమా కంపెనీ నుంచి మెసేజ్ మరియు ఈమెయిల్ ద్వారా పాలసీ వివరాలు వస్తాయి. అలాగే, నామినీ వివరాలు సమర్పించేందుకు అవసరమైన లింక్ కూడా వస్తుంది. ప్రయాణికుడు ఆ ఫారాన్ని పూర్తి చేస్తే, ఇక నుండి బీమా కంపెనీకి పాలసీ జారీ చేయడం మరియు క్లెయిమ్ సెటిల్ చేయడం ఉంటుంది.
ఒకవేళ ప్రమాదం జరిగినపుడు ప్రయాణికుడు లేదా అతని బంధువులు బీమా కంపెనీతోనే నేరుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మెయిల్‌లో వచ్చిన పత్రాలను వినియోగించుకోవచ్చు.
రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, గత 5 ఏళ్లలో 333 క్లెయిమ్స్ నమోదు కాగా, మొత్తం రూ. 27.22 కోట్లు ప్రయాణికులకు లేదా వారి బంధువులకు బీమా కంపెనీలు చెల్లించాయి.
రైల్వే ప్రయాణ బీమా కవరేజ్ కేవలం ప్రయాణికుడు మృతి చెందినప్పుడు మాత్రమే కాకుండా, ప్రమాదాల వలన శారీరకంగా గాయపడిన సందర్భాల్లోనూ వర్తిస్తుంది. ఈ బీమా కింద, ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ మరణించినట్లయితే లేదా శాశ్వత వికలాంగుల గురైనట్లయితే రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. అలాగే తాత్కాలిక వైకల్యానికి రూ.7.5 లక్షల వరకు, ఆసుపత్రిలో చికిత్స కోసం అవసరమైన ఖర్చులకు రూ.2 లక్షల వరకు బీమా అందుతుంది. అయితే, ఈ మొత్తం సొమ్ములు భీమా సంస్థల పాలసీల ఆధారంగా కొంత మారవచ్చని గుర్తుంచుకోవాలి.
ప్రస్తుతం రైల్వే ప్రయాణ బీమా సేవలను అందిస్తున్న సంస్థలు ICICI లొంబార్డ్, SBI జనరల్ ఇన్‌షూరెన్స్, మరియు శ్రీరామ్ జనరల్ ఇన్‌షూరెన్స్. అయితే ఇవి స్థిరంగా ఉండవు, కొన్ని సమయాల్లో మారుతూ ఉంటాయి. టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికుడు తనకు నచ్చిన ఇన్‌షూరెన్స్ కంపెనీని ఎంపిక చేసుకోవచ్చు.
ఈ ప్రక్రియ పూర్తిగా సులభమైనది, ప్రయాణికులకు అదనంగా ఏవైనా డాక్యుమెంట్లు లేదా ఫారాల అవసరం లేదు. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన మరొక మెరుగైన చొరవగా ఈ స్కీమ్ కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications