పాత వాహనాలు ఇస్తే 5% రాయితీ: ఆటో రంగానికి వరం, ఉద్యోగాలు పెరుగుతాయ్
పాత కారును విక్రయించి, కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు. వ్యర్థమైన, పాత వాహనాలను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నవారు వాటిని అప్పగించి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే ఐదు శాతం రాయితీ లభిస్తుంది. వెహికిల్ స్క్రాపేజీ పాలసీలో ఈ నిబంధనను కేంద్రం చేర్చనుంది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆటో మేకర్స్ నుండి కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే పాత వాహనం వెహికిల్ స్క్రాపేజీ పాలసీ కింద ఐదు శాతం రిబేట్ ఉంటుందని తెలిపారు.

స్క్రాపేజీ పాలసీ
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాలంటరీ వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పర్సనల్ వెహికిల్స్‌కు 20 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ టెస్ట్, కమర్షియల్ వెహికిల్స్‌కు 15 ఏళ్ళ తర్వాత పిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరి. మరో పదిహేను రోజుల్లో వెహికిల్ స్క్రాపేజీ పాలసీని కేంద్రం వెల్లడిస్తుంది. పాత వాహనాలు ఇచ్చి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే ఐదు శాతం రిబేట్ ఇవ్వాలని తెలిపింది. పాత వాహనాలు అప్పగించి కొత్తది కొనుగోలు చేస్తే ఆటోమొబైల్ సంస్థలు ధరలో ఐదు శాతం రాయితీ ఇవ్వాలి.

ఫిట్ నెస్ కేంద్రాలు
వెహికిల్ స్క్రాపేజీలో ప్రధానంగా నాలుగు ఉన్నాయి. పాత వాహనాలు ఇస్తే రిబేట్ ఉంటుంది. ఇది కాకుండా పాత వాహనాల పైన గ్రీన్ ట్యాకెస్స్, ఇతర సుంకాలు ఉన్నాయి. ఈ వాహనాలకు ఫిట్ నెస్ పరీక్ష తప్పనిసరి. పొల్యూషన్ పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఈ ఆటోమేటెడ్ ఫిట్ నెస్ కేంద్రాలు దేశవ్యాప్తంగా అవసరమని, ఆ దిశగా పని చేస్తున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు.

ఆటో రంగానికి లాభదాయకం
ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (PPP)తో ఫిట్‌నెస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. స్క్రాపేజీ సెంటర్ల కోసం ప్రయివేటు భాగస్వామ్య సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చేయూతనిస్తుంది. ఆటోమేటెడ్ టెస్టుల్లో విఫలమైన వెహికల్స్ పైన భారీ జరిమానా విధిస్తారు. వెహికిల్ స్క్రాపేజీ విధానం ఆటో మొబైల్ ఇండస్ట్రీకి వరం కానుంది. అప్పుడు అత్యంత లాభదాయక రంగాల్లో ఒకటిగా ఉండనుంది. దీంతో ఉపాధి కూడా భారీగా లభిస్తుంది.


Click it and Unblock the Notifications