IPO News: త్వరలో జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ ఐపీవో.. దీంతో 7 శాతం లాభపడ్డ స్టాక్ ఇదే..!
JSW Cement IPO: భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం పెద్ద కంపెనీల నుంచి చిన్న సంస్థల వరకు అందరూ ఐపీవో ఫ్లోటింగ్ పై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సిమెంట్ కంపెనీ JSW సిమెంట్ త్వరలో ఐపీవో కోసం తన ప్రణాళికతో ముందుకొచ్చింది. జిందాల్ ఫ్యామిలీ కంపెనీ ఇప్పటికే సెబీ వద్ద ఐపీవో కోసం దరఖాస్తు చేసుకుంది.
తాజా ఐపీవో ద్వారా జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.4,000 కోట్లను సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. అయితే సెబీ నుంచి ఐపీవోకు అనుమతులు లభిస్తే 2021 తర్వాత భారత స్టాక్ మార్కెట్లలో ప్రవేశించే అతిపెద్ద సిమెంట్ కంపెనీగా ఇది అవతరిస్తుంది. ఈ ఐపీవోలో ఫ్రెష్ ఈక్విటీ ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఓఎఫ్ఎస్ కింద ఏషియా ఆపర్చునిటీ హోల్డింగ్స్, సినర్జీ మెటల్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్‌లు రూ.937 కోట్ల విలువైన షేర్లను విక్రయించాలని చూస్తున్నాయి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.125 కోట్ల విలువైన తన హోల్డింగ్స్‌ను విక్రయించనుందని తెలుస్తోంది. JSW సిమెంట్‌లో 78% వాటా ప్రమోటర్లు కలిగి ఉన్నారు.

కంపెనీ ఐపీవో ద్వారా సమీకరించిన సొమ్ములో రాజస్థాన్‌లోని నాగ్‌పూర్‌లో రూ.800 కోట్లతో కొత్త సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు వినియోగించాలని నిర్ణయించింది. అలాగే రూ.720 కోట్లను రుణ చెల్లింపులకు వినియోగించాని యోచిస్తోంది. 2006లో స్థాపించబడిన జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 ఉత్పత్తి యూనిట్లను కలిగి ఉంది. కంపెనీ దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని త్వరగా 60 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలని ప్రయత్నిస్తోంది.
లాభపడిన స్టాక్ ఇదే..!!
JSW సిమెంట్స్ ఐపీవో వార్త శివ సిమెంట్ షేర్లను నేడు 7 శాతం పెంచింది. వాస్తవానికి శివ సిమెంట్‌కు చెందిన ప్రమోటర్ JSW గ్రూప్ కావటమే ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ తన ఐపీవో ప్రణాళికలో భాగంగా సెబీ వద్ద దరఖాస్తు చేసుకోవటంతో శివ సిమెంట్స్ షేర్లు లాభపడుతున్నాయి. శివ సిమెంట్‌ను 2017లో JSW గ్రూప్ కొనుగోలు చేసింది.
ప్రస్తుతం కంపెనీలో 59 శాతం వాటాలను జేఎస్డబ్ల్యూ కలిగి ఉంది. శివ సిమెంట్ ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో ఉనికిని కలిగి ఉంది. నేడు బీఎస్ఈలో శివ సిమెంట్ షేరు రూ.54.95 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా రూ.57.05 ధరను తాకాయి. గడచిన 5 రోజుల్లో కంపెనీ షేర్ల ధర 17 శాతానికి పైగా లాభపడింది.


Click it and Unblock the Notifications