బంగారం, వెండి ధరలు తగ్గుతాయా..పెరుగుతాయా.. సంచలన రిపోర్ట్ విడుదల చేసిన దిగ్గజ బ్యాంక్ జేపీమోర్గాన్..
అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం జేపీమోర్గాన్ (JPMorgan) విలువైన లోహాల మార్కెట్‌పై తన తాజా సమీక్షను విడుదల చేసింది. తన సమీక్షలోబంగారం ధరల స్వల్పకాలిక పెరుగుదల అంచనాలను కొంతమేర సవరించింది. మార్కెట్‌లోని కీలక రంగాల నుండి Gold కోసం వచ్చే డిమాండ్ తాము గతంలో అంచనా వేసినంత బలంగా ఉండకపోవచ్చని బ్యాంక్ విశ్లేషించింది. ఈ కారణంగానే ప్రస్తుత ఏడాదిలో Gold ధరల పెరుగుదల వేగం కొంత మందగించి.. మూడవ త్రైమాసికంలో ఔన్సుకు 4,300 డాలర్లకు, నాలుగవ త్రైమాసికంలో ఔన్సుకు 4,500 డాలర్ల స్థాయికి పరిమితం కానుందని స్పష్టం చేసింది.
ఈ సవరించిన అంచనాలకు గల కారణాలను వివరిస్తూ.. రాబోయే వేసవి కాలం మిగిలిన భాగంలో ఒకవేళ అమెరికా ఆర్థిక డేటా గనుక వేగంగా వెలువడితే.. దానికి అనుగుణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) వడ్డీ రేట్లను మార్కెట్ అంచనాల కంటే ముందే పెంచే అవకాశం ఉందని బ్యాంక్ తెలిపింది. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు మెరుగైన స్థిర రాబడినిచ్చే ఇతర ఆర్థిక ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు.

దీనివల్ల వడ్డీ లేదా డివిడెండ్ వంటి ప్రత్యక్ష రాబడిని ఇవ్వని బులియన్ మార్కెట్‌పై అదనపు భారం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తమ తాజా అంచనాలకు ఉన్న మార్కెట్ నష్టాలు కొంత ప్రతికూలంగానే ఉన్నాయని జేపీమోర్గాన్ అభిప్రాయపడింది. ఈ తాజా విశ్లేషణకు కొద్ది రోజుల ముందే.. అంటే జూన్ 9వ తేదీన జేపీమోర్గాన్ ఈ సంవత్సరాంతానికి బంగారం ధరలు ఏకంగా 6 వేల డాలర్లకు పెరుగుతాయని అంచనా వేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
అయినప్పటికీ ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తే శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ధర 1.3 శాతం మేర వృద్ధి చెంది ఔన్సుకు 4,174.21 డాలర్ల వద్ద ముగిసింది, ఇది జూన్ 23 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం విశేషం. ఈ ఒక్క వారంలోనే బులియన్ మార్కెట్ 2 శాతం కంటే ఎక్కువ లాభపడింది. స్వల్పకాలికంగా అంచనాలను తగ్గించినప్పటికీ, జేపీమోర్గాన్ బంగారంపై తన దీర్ఘకాలిక సానుకూల దృక్పథాన్ని (Bullish Outlook) అలాగే కొనసాగించింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు జరుపుతున్న నిరంతర కొనుగోళ్లు.. మార్కెట్లో భౌతిక డిమాండ్ స్థిరంగా బలోపేతం కావడం, కొనుగోళ్ల వృద్ధికి దోహదపడే అంతర్లీన నిర్మాణాత్మక అంశాలు బలంగా ఉండటం వల్ల రాబోయే 2027వ సంవత్సరంలో బంగారం ధరలు మరింతగా పుంజుకుంటాయని బ్యాంక్ ధీమా వ్యక్తం చేసింది. బంగారంతో పాటు ఇతర విలువైన లోహాలైన వెండి, ప్లాటినం, పల్లాడియం ధరలపై కూడా జేపీమోర్గాన్ తన అంచనాలను వెల్లడించింది.
గత సంవత్సరం మార్కెట్లో నెలకొన్న కఠినమైన భౌతిక సరఫరా పరిస్థితుల నుండి మార్కెట్ ప్రస్తుతం బయటపడటం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం-వెండి ధరల నిష్పత్తి (Gold-Silver Ratio) తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం వల్ల, రాబోయే అంచనా కాలంలో వెండి ధరలు ఔన్సుకు సగటున 60 డాలర్ల నుండి 65 డాలర్ల పరిధిలో స్థిరంగా ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు, ప్లాటినం మార్కెట్‌కు దక్షిణాఫ్రికా నుండి వస్తున్న సరఫరా-వైపు ప్రాథమిక అంశాలు (Supply-side Fundamentals) గట్టి మద్దతునిస్తున్నాయని.. దీనివల్ల ప్లాటినం ధరలు 2026 చివరి నాటికి ఔన్సుకు సగటున సుమారు 1,800 డాలర్లకు, 2027 చివరి నాటికి మరింతగా పెరిగి సుమారు 1,950 డాలర్ల స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది.
అయితే, విలువైన లోహాల రంగంలో నెలకొన్న విస్తృత బలహీనత కారణంగా పల్లాడియం మాత్రం కొంత ఒత్తిడిని ఎదుర్కొంటుందని, దీని ధరలు 2026 ఆఖరు నాటికి ఔన్సుకు 1,350 డాలర్లకు పరిమితమై, 2027లో సగటున సుమారు 1,300 డాలర్ల వద్ద కదలాడవచ్చని బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
