జొన్నగిరి బంగారు గని గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు.. దీని ద్వారా ఏపీకి వచ్చే ఆదాయం ఎంతంటే..
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక , మైనింగ్ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు తవ్వకం ప్రాజెక్టుగా అభివర్ణించబడుతున్న జొన్నగిరి భారీ గోల్డ్ మైనింగ్ , శుద్ధి ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా ఒక ప్రైవేటు యాజమాన్యంలోని బంగారు గని వాణిజ్యపరంగా తన ఉత్పత్తిని ప్రారంభించినట్లయింది. Jonnagiri Gold Mine ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇప్పటికే జొన్నగిరి గ్రామానికి 'స్వర్ణగిరి'గా పేరు మార్చడానికి ఆమోదం తెలపడం విశేషం.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మొత్తం రూ. 405 కోట్ల పెట్టుబడితో నిర్మించారు. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 'జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' (GMSI) ఈ గనిని నిర్వహిస్తోంది. సుమారు 598 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఇది.. దేశంలో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక ప్రైవేట్ 'ప్రాథమిక బంగారు గని'గా గుర్తింపు పొందింది. ప్రాథమిక బంగారు గని అంటే భూమి లోపల లోతుగా ఉండే గట్టి రాతి క్వార్ట్జ్ సిరలలో బంధించబడి ఉన్న బంగారాన్ని (లోడ్ డిపాజిట్) వెలికితీసి, రసాయన , భౌతిక పద్ధతుల ద్వారా శుద్ధి చేసే ఒక అధునాతన విధానం. ఈ గనిలో మే నెలలోనే ప్రయోగాత్మక (ట్రయల్) ఉత్పత్తి ప్రారంభమవ్వగా, బుధవారం నాటి ప్రారంభోత్సవంతో ఇది పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాల దశకు చేరుకుంది.

సరిగ్గా ఇదే వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు యొక్క రెండవ ప్రాసెసింగ్ యూనిట్ (రెండో దశ) విస్తరణకు శంకుస్థాపన కూడా చేశారు. విక్సిత్ భారత్ మిషన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని "స్వర్ణాంధ్రప్రదేశ్"గా మార్చాలన్న తన దార్శనికతకు ఈ ప్రాజెక్ట్ ఒక ఆరంభమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1,500 ఎకరాల భూమిని కేటాయించగా.. మొదటి దశలో 600 ఎకరాల్లో మైనింగ్ ప్రారంభమైంది. మిగిలిన ప్రాంతాన్ని భవిష్యత్ దశల్లో విస్తరిస్తారు. ఈ మైనింగ్ కార్యకలాపాలకు అవసరమైన నీటిని 'హంద్రీ నీవ సుజల స్రవంతి' పథకం ద్వారా 18 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను నిర్మించి సుమారు 0.021 టీఎంసీల (59.46 కోట్ల లీటర్లు) నీటిని సరఫరా చేసేలా మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు.
ఉత్పత్తి , ఉపాధి విషయానికి వస్తే.. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి పూర్తి సంవత్సరంలో (2026-27) సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తిని ఈ గని లక్ష్యంగా పెట్టుకుంది. రెండవ సంవత్సరం నుండి ఈ వార్షిక ఉత్పత్తి ఒక టన్నుకు (900 కిలోలు) పెరగనుంది. ఇప్పుడు శంకుస్థాపన జరిగిన రెండో దశ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 2 టన్నులకు విస్తరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 700 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తుండగా, అందులో 80 శాతం మంది స్థానిక వర్గాల వారికే దక్కడం గమనార్హం.
ఆర్థికంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఒక స్థిరమైన రాబడి సమకూరనుంది. బంగారం ఉత్పత్తి విలువపై రాష్ట్ర ప్రభుత్వానికి 4 శాతం రాయల్టీ లభిస్తుంది. దీని ప్రకారం మొదటి ఏడాది 400 కిలోల ఉత్పత్తిపై సుమారు రూ. 57 కోట్ల రాయల్టీ లభిస్తుండగా, వార్షిక ఉత్పత్తి 900 కిలోలకు చేరినప్పుడు ఈ ఆదాయం ఏకంగా రూ. 144 కోట్లకు పెరుగుతుందని అంచనా.
భూగర్భ శాస్త్ర కోణంలో ఈ ప్రాంతం అత్యంత కీలకమైన 'చిగుర్గుంట-బిసనాథం' ఖనిజ పట్టీలో భాగంగా ఉంది. గనుల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. ఈ బ్లాక్‌లో టన్నుకు 5.6 గ్రాముల సగటు గ్రేడ్‌తో 2.2 మిలియన్ టన్నులకు పైగా ఖనిజ వనరులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్లాక్‌ను ఏకీకృత మైనింగ్ పోర్టల్ ద్వారా వేలం వేస్తున్నారు. దీనితో పాటు అనంతపురం జిల్లాలోని బోక్సంపల్లి, రామగిరి, జవకుల వంటి ప్రాంతాలలో కూడా అన్వేషణ చురుగ్గా సాగుతోంది. ఈ నిర్మాణాలు వాటి లక్షణాల పరంగా చారిత్రాత్మక కర్ణాటకలోని కోలార్ (KGF), హుట్టి గోల్డ్ ఫీల్డ్స్‌తో పోల్చదగినవి కావడం విశేషం. కోలార్ తరహాలోనే ఈ లంకెలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తే.. ఈ స్వర్ణగిరి ప్రాజెక్ట్ భారతదేశపు బంగారు తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications
