John Lewis Partners: ప్రపంచాన్ని కుదిపేస్తున్న లేఆఫ్స్ వల్ల టెక్ కంపెనీల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఇతర సెక్టార్ల ఉద్యోగులపై కూడా ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏడాది ప్రారంభమై పట్టుమని 10 రోజులు గడవక ముందే దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్‌పై తమ భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించాయి.
UKకి చెందిన ప్రముఖ సంస్థ జాన్ లూయిస్ పార్టనర్‌షిప్.. డిపార్ట్‌మెంట్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా పలు రిటైల్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఖర్చులు తగ్గించుకుంటూ, తిరిగి లాభాల్లోకి వచ్చేందుకు పలు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో 11 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

సూపర్ మార్కెట్‌లు మరియు డిపార్ట్‌మెంట్ స్టోర్‌లలో కనీసం 10 శాతం మంది సిబ్బందిపై దీని ప్రభావం ఉండనున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. కొత్త ఉద్యోగులను భర్తీ చేసుకోకుండా క్రమేపీ సిబ్బందిని సంఖ్యను తగ్గించవచ్చని అంచనా వేసింది. కస్టమర్లు ఖర్చులు తగ్గించుకోవడంతో 159 ఏళ్ల పురాతన గ్రూపు ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీన్ని మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
'జాన్ లూయిస్ పార్టనర్‌షిప్‌ను తిరిగి లాభాల్లోకి తీకుకువచ్చేందుకు మావద్ద ఓ ప్రణాళిక ఉంది. కస్టమర్ అనుభూతి, టెక్నాలజీ, స్టోర్‌లను మెరుగుపరచడానికి మరియు మరింత సమర్థవంతంగా మార్చడానికి భారీగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాం. ఈ విధానం ద్వారా మా పనితీరు మెరుగుపడుతోంది. కానీ మా వ్యాపారంలో అవసరమైన భాగస్వాముల సంఖ్యను తగ్గించాలని చూస్తున్నాం' అని కంపెనీ పేర్కొంది.
బ్రిటీష్ రిటైలర్ గత మార్చిలోనే తన ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారులు ఖర్చులు తగ్గించిన క్రమంలో సిబ్బంది సంఖ్యను తగ్గించి, బోనస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు చెప్పింది. కాగా ఇప్పుడు అందుకు తగిన విధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.


Click it and Unblock the Notifications