Jiostar: జియో సినిమాను నంబర్ వన్ చేసిన వ్యక్తి.. ఇప్పుడు ఏఐ ప్రపంచాన్ని ఏలబోతున్నారా?
భారతీయ డిజిటల్ మీడియా రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రిలయన్స్ గ్రూపునకు చెందిన జియోస్టార్ (JioStar) డిజిటల్ విభాగం సీఈఓ కిరణ్ మణి తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ 'ఓపెన్ ఏఐ' (OpenAI)లో ఆయన చేరబోతున్నారు. ఆసియా పసిఫిక్ (APAC) ప్రాంతానికి మేనేజింగ్ డైరెక్టర్ గా కిరణ్ మణి బాధ్యతలు చేపట్టనున్నారు. సింగపూర్ కేంద్రంగా ఆయన ఈ ప్రాంతంలోని ఓపెన్ ఏఐ వ్యూహాలను , కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.

జియోస్టార్ ప్రస్థానంలో కీలక పాత్ర జియోస్టార్ అభివృద్ధిలో కిరణ్ మణి పాత్ర ఎంతో కీలకమైనది. 2023లో వయాకామ్18లో చేరిన ఆయన, జియోసినిమాను (JioCinema) భారతదేశపు అగ్రశ్రేణి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా మార్చడంలో విజయం సాధించారు. ముఖ్యంగా డిస్నీ+ హాట్‌స్టార్ , జియోసినిమా విలీన ప్రక్రియలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఫిబ్రవరి 2025లో లాంచ్ అయిన 'జియోహాట్‌స్టార్' (JioHotstar) ప్లాట్‌ఫారమ్ ద్వారా క్రీడలు , ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను కోట్లాది మందికి చేరువ చేయడంలో ఆయన కృషి మరువలేనిది.
ఓపెన్ ఏఐ ఎందుకు ఎంచుకుంది?
ప్రస్తుతం భారతదేశం ఓపెన్ ఏఐకి ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద యూజర్ బేస్‌గా ఉంది. జపాన్ , ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా ఏఐ టూల్స్ వాడకం విపరీతంగా పెరుగుతోంది. ఈ తరుణంలో ఆసియా మార్కెట్‌ను మరింత విస్తరించడానికి కిరణ్ మణి వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరమని ఓపెన్ ఏఐ భావించింది. కిరణ్ మణికి గూగుల్, మైక్రోసాఫ్ట్ , ఐబిఎమ్ వంటి దిగ్గజ సంస్థల్లో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో గూగుల్ ప్లే , ఆండ్రాయిడ్ విభాగాలకు ఆసియా పసిఫిక్ ఎండీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఇప్పుడు బాగా కలిసి రానుంది.
ఏఐ రంగంలో భారతీయ ముద్ర కిరణ్ మణి నిష్క్రమణ జియోస్టార్ సంస్థకు ఒక లోటు అని చెప్పవచ్చు, కానీ ఓపెన్ ఏఐ వంటి అంతర్జాతీయ సంస్థలో ఒక భారతీయుడు అత్యున్నత పదవిని చేపట్టడం గర్వకారణం. జూన్ నెల నుండి ఆయన తన కొత్త బాధ్యతలను ప్రారంభించనున్నారు. ఓపెన్ ఏఐ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జేసన్ క్వాన్‌కు ఆయన నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. భారతదేశం , ఆసియా దేశాల్లో చాట్ జీపీటీ , ఇతర ఏఐ మోడల్స్ వాడకాన్ని మరింత పెంచడం, ఎంటర్‌ప్రైజ్ బిజినెస్‌ను విస్తరించడమే లక్ష్యంగా ఆయన పనిచేయనున్నారు.


Click it and Unblock the Notifications