రిలయన్స్ జియో సంచలనానికి సిద్ధమైంది. 5G స్మార్ట్ ఫోన్‌ను అతి తక్కువ ధరకు అందుబాటులోకి తేవడానికి సిద్ధమైంది. రూ.5,000 లోపు దానిని అందుబాటులోకి తెచ్చి, క్రమంగా రూ.2,500 నుండి రూ.3,000కే కస్టమర్లకు విక్రయించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం 2G కనెక్షన్ కలిగిన సుమారు 30 కోట్లమంది వరకు మొబైల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నది. 2016లో ప్రారంభమైన జియో డేటా ప్యాక్, కాల్ ఛార్జీ నుండి స్మార్ట్ ఫోన్ వరకు వరుస సంచలనాలతో ముందుకు సాగుతోంది.

రూ.2500 నుండి రూ.3000 మధ్య
జియో రూ.5,000 లోపే 5G స్మార్ట్ ఫోన్ తీసుకు రావాలని భావిస్తోందని, చివరకు రూ.2500 నుండి రూ.3000కే వాటిని మార్కెట్లో విక్రయించాలని అనుకుంటోందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. అయితే రిలయన్స్ జియో నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. జియో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మన దేశంలో ప్రస్తుతం 5G సేవలు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ల ధర కనీసం రూ.27,000 నుండి ఉంది. 4G సేవలు అందుబాటులోకి వచ్చినా దేశంలో 30 కోట్ల మందికి పైగా ఇంకా 2G ఫీచర్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. 5G స్మార్ట్ ఫోన్‌ను అతి తక్కువ ధరకు ఇవ్వడం ద్వారా వీరిని ఆకర్షించవచ్చునని భావిస్తోంది.

గూగుల్‌లో జియో ఇన్వెస్ట్...
గతంలో రిలయన్స్ జియో 4G సేవల కోసం రూ.1,500కే మొబైల్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కోట్లాదిమంది ఖాతాదారులను సంపాదించుకుంది. ఇప్పుడు 5G విషయంలోను అదే ధోరణితో ముందుకు సాగుతోంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫాంలోకి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. గూగుల్ రూ.33,737 కోట్లు జియోలో ఇన్వెస్ట్ చేసింది. 7.7 శాతం వాటాను దక్కించుకుంది.

ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్
అమెరికా టెక్ దిగ్గజంతో కలిసి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 2016లో ప్రారంభమైన రిలయన్స్ జియో వేగంగా వృద్ధి చెందింది. ప్రస్తుతం 40 కోట్ల మందికి పైగా కస్టమర్లతో మొదటి స్థానంలో నిలిచింది. తక్కువ కాలంలోనే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లను అధిగమించింది.


Click it and Unblock the Notifications