JetAirways Wife: దేశంలోని ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఆమె ముంబైలో మృతిచెందారు.
దీనికి ముందు బాంబే హైకోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో నరేష్ గోయల్ బయటకు వచ్చారు. అనితా గోయల్ అంత్యక్రియలు ముంబైలోనే నిర్వహించనున్నట్లు వెల్లడైంది. మే 6న బాంబే హైకోర్టు వైద్యం, మానవతా కారణాలతో గోయల్‌కు రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో గోయల్ తప్పనిసరిగా లక్ష రూపాయల పూచీకత్తు చెల్లించాలని, ట్రయల్ కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా ముంబై వదిలి వెళ్లరాదని హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ పేర్కొంది. గోయల్ పాస్‌పోర్టును అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేక న్యాయస్థానం గోయల్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించిన నెలల తర్వాత ఇటీవల ఉపశమనం లభించింది. అయితే అతనికి నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స పొందేందుకు అనుమతించింది. గోయల్ వైద్య కారణాలతో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. గోయల్ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే ఈ కేసును మానవతా దృక్పథంతో పరిగణించాలని కోర్టును కోరారు. శారీరక ఆరోగ్యం క్షీణించడంతో పాటు, గోయల్ మానసిక ఆరోగ్యం కూడా బాగా లేదని సాల్వే కోర్టుకు చెప్పారు.
ఇదే సమయంలో ఈడీ తరపున హాజరైన హితేన్ వెనెగావ్కర్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. గోయల్ ఆసుపత్రిలో చేరడం పొడిగిస్తే కేంద్ర ఏజెన్సీకి ఎటువంటి సమస్యలు ఉండవని అన్నారు. కోర్టు గోయల్ ఆసుపత్రిలో చేరడాన్ని కొన్ని వారాల పాటు పొడిగించవచ్చని, ఆ తర్వాత అతని పరిస్థితిని అంచనా వేయడానికి తాజా వైద్య నివేదిక కోసం పిలవవచ్చని వాదించారు.
సెప్టెంబరు 2023లో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. జెట్ ఎయిర్‌వేస్‌కు కెనరా బ్యాంక్ ఇచ్చిన రూ.538.62 కోట్ల విలువైన రుణాలను గోయల్ లాండరింగ్ చేసి స్వాహా చేసినట్లు ఈడీ ఆరోపించింది. అయితే ఈడీ ఛార్జిషీట్ సమర్పించినప్పుడు నవంబర్ 2023లో నరేష్ గోయల్ భార్య అనితా గోయల్‌ని సైతం అరెస్ట్ చేశారు. అనితా గోయల్ వయస్సు, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక కోర్టు అదే రోజు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించటంతో అనితా మరణించారు.


Click it and Unblock the Notifications