రెండేళ్ల తర్వాత... జెట్ ఎయిర్వేస్ ఎగురవచ్చు! సరుకు రవాణా, చిన్న పట్టణాలపై దృష్టి
న్యూఢిల్లీ: 2021 వేసవి నాటికి జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పునరుద్ధరణ అవకాశాలు దక్కించుకున్న సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. NCLTతో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ ఇతర రెగ్యులేటరీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు సోమవారం యూఏఈ వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్, లండన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్ కన్సార్షియం తెలిపింది.
విమానాశ్రయంలో స్లాట్స్ కేటాయింపు, ద్వైపాక్షిక ట్రాఫిక్ హక్కులు తదితర అంశాలపై సంబంధిత వర్గాలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ అవకాశం దక్కించుకున్న అనంతరం ఈ కన్సార్టియం తొలిసార బహిరంగ ప్రకటన చేసింది.

పునఃప్రారంభిస్తాం
వచ్చే వేసవి నాటికి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు పునఃప్రారంభిస్తామని జలాన్-కల్రాక్ క్యాపిటల్ కన్సార్టియం ప్రకటించింది. ఓసారి విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాక సరకు రవాణా సేవల్ని కూడా ప్రారంభిస్తామని తెలిపింది. కన్సార్టియం దాఖలు చేసిన పునరుజ్జీవ ప్రణాళికకు కమిటీ ఆఫ్ క్రెడిటార్స్(COC) అక్టోబర్ నెలలోనే ఆమోదముద్ర వేసింది.
2019 ఏప్రిల్ 17 నుండి ద్రవ్యలభ్యత సంక్షోభం కారణంగాజెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. పునరుజ్జీవ ప్రణాళిక ప్రకారం భారత్‌లో ఇదివరకు కార్యకలాపాలు నిర్వహించిన అన్ని స్లాట్‌లలో తిరిగి కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తున్నట్లు కన్సార్టియం తెలిపింది. అంతర్జాతీయ కార్యకలాపాలు కూడా ప్రారంభిస్తామని వెల్లడించింది.

సరకు రవాణా సేవలు మరింత పెంచడం..
ది జెట్ 2.0 పథకం కింద తిరిగి పూర్వవైభవం తీసుకు వస్తామని, అదే తమ లక్ష్యమని తెలిపింది. అన్ని అనుమతులు వచ్చాక 2021 వేసవి వరకు జెట్ ఎయిర్వేస్ కార్యకలపాలు ప్రారంభమవుతాయని కన్సార్టియం తన ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ, మంబై, బెంగళూరులలో హబ్స్ ఉంటాయని, టైర్ 2, టైర్ 3 నగరాల్లో సబ్ హబ్స్ ఏర్పాటు చేయాలని పునరుజ్జీవ ప్రణాళిక ప్రతిపాదించింది. కరోనా వ్యాక్సీన్ తయారీలో అంతర్జాతీయ సమాజానికి భారత్ కీలకంగా మారడంతో సరకు రవాణా సేవల్ని పెంచాలని కన్సార్టియం భావిస్తోంది.

రెండేళ్ల తర్వాత..
జలాన్, కల్రాక్ కన్సార్షియం వచ్చే వేసవిలో జెట్ ఎయిర్వేస్‌ను తిరిగి ఎగిరించే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, అదే జరిగితే రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ తిరిగి విమానాలు అందుబాటులోకి వచ్చినట్లు. దేశ, విదేశీ సర్వీసులను పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న జెట్ ఎయిర్వేస్ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలని భావిస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన జెట్ రూ.9వేల కోట్ల రుణ సంక్షోభంతో దివాలా తీసింది. ప్రస్తుతం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు సంస్థలో మెజారిటీ వాటా ఉంది.


Click it and Unblock the Notifications