Marriages: వివాహ వేడుకలపై జెఫరీస్ అమేజింగ్ రిపోర్ట్.. ఆ విషయంలో చైనా, అమెరికాలు కూడా నథింగ్
Jefferies Report: భారతీయ సాంప్రదాయాలు ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక వివాహాల విషయమైతే చెప్పాల్సిన పనిలేదు. విదేశీయులు డబ్బు వెచ్చించి మరీ ఇండియన్ పెళ్లిళ్లకు హాజరు కావడం, వాటిలో పాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. గతంతో పోలిస్తే ఈ మధ్య వివాహాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కాగా వీటికి సంబంధించిన గణాంకాలు వింటే దిమ్మ తిరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇండియాలో కేవలం వివాహాలపై ఏటా సుమారు 10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తన నివేదికలో తెలిపింది. ఆహారం మరియు కిరాణా సరుకుల తర్వాత పెళ్లిళ్లపై వెచ్చించే ఖర్చు రెండవ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. సగటు భారతీయులు విద్యతో పోలిస్తే వివాహ వేడుకలకు రెండింతలు స్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.

'చైనాలో దాదాపు 80 లక్షలు మరియు అగ్రరాజ్యం అమెరికాలో సుమారు 20 లక్షలతో పోలిస్తే భారతదేశంలో ఏటా 1 కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్ల కోసం అమెరికా వెచ్చిస్తున్న 70 బిలియన్ డాలర్ల కంటే ఇండియా ఎక్కువ ఖర్చు పెడుతోంది. భారత్‌తో పోలిస్తే చైనాలో వివాహాల సంఖ్య కొంత తక్కువే అయినా ఇండియా కంటే రెండింతలు ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు' అని జెఫరీస్ వివరించింది.
ఈ వివాహాల వల్ల ఇండియాలో పలు పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా ఆభరణాలు మరియు దుస్తుల వినియోగాన్ని ఇవి భారీ స్థాయిలో ప్రోత్సహిస్తున్నాయి. ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కూడా పరోక్షంగా ప్రయోజనం పొందుతున్నాయి. అయితే నిర్దిష్ట నెలల్లో మాత్రమే ముహుర్తం ఆధారంగా నిర్వహించబడటం వల్ల రెగ్యులర్‌గా ఆయా ఉత్పత్తులకు ఆ మేర డిమాండ్ ఉండదు. కానీ వివాహాల సీజన్‌లో మాత్రం కొనుగోళ్లు హోరెత్తిపోతాయి.


Click it and Unblock the Notifications