అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకులు, సీఈఓ జెఫ్ బెజోస్ కంపెనీలో తన వాటాకు చెందిన 310 కోట్ల డాలర్ల (3.1 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను విక్రయించాడు. గత ఏడాది విక్రయించిన మొత్తం షేర్ల కంటే ఈసారి అధికంగా విక్రయించాడు. ఫైలింగ్ ప్రకారం ఈ ఏడాది జెఫ్ బెజోస్ కంపెనీలో 4.1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. తాజా స్టేక్ సేల్‌తో కలిపి ఆయన ఈ ఏడాదిలో విక్రయించిన మొత్తం షేర్ల విలువ 7.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

అందుకే షేర్ల విక్రయం
పెద్ద ఎత్తున షేర్లు విక్రయించినప్పటికీ జెఫ్ బెజోస్ వద్ద ఇప్పటికీ 54 మిలియన్ల షేర్లు ఉన్నాయి. వీటి వ్యాల్యూ 170 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తం అతనిని ప్రపంచ అత్యధిక ధనికుడిగా నిలబెడుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ-కామర్స్‌కు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది కంపెనీ షేర్లు ఏకంగా 73 శాతం ఎగిశాయి. ఆగస్ట్ తొలి రెండు వర్కింగ్ డేస్‌లో 1 మిలియన్ షేర్లు విక్రయించాడు బెజోస్. తన రాకెట్ సంస్థ బ్లూఆరిజన్‌కు నిధులను సమీకరించేందుకు ప్రతి ఏడాది 1 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.

దూసుకెళ్తున్న షేర్లు
జెఫ్ బెజోస్ 2019లో 2.8 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. స్పేస్ ఎక్స్‌ప్లోరేష్న కంపెనీ బ్లూఆరిజిన్ నిధుల కోసమే విక్రయిస్తున్నట్లు గతంలోనే చెప్పాడు. గత వారం అమెజాన్ తన సెకండ్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించింది. విశ్లేషకుల అంచనాలను మించి వృద్ధిని నమోదు చేసింది. కరోనా కారణంగా ఆన్‌లైన్ కొనుగోలుదారులు పెరగడంతో అమెజాన్ దూసుకెళ్లింది. ఈ ఏడాది 73 శాతం ఎగిసిన షేర్లు, బుధవారం ఒక్కరోజే 2.1 శాతం దూసుకెళ్లింది.

అంతరిక్షంలో ముద్ర
జెఫ్ బెజోస్‌తో పాటు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గత వారం యాంటీట్రస్ట్ సబ్ కమిటీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ విక్రయం వెలుగు చూసింది. అయితే ప్రతి ఏడాది విక్రయిస్తానని ముందే ప్రకటించారు బెజోస్. అంతరిక్షంలో ప్రత్యేక ముద్ర వేసేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్, జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూఆరిజిన్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.


Click it and Unblock the Notifications