Jay Kailash Namkeen IPO: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఎన్నడూ లేని కొత్త గరిష్ఠాలను చేరుకోవటంతో మార్కెట్లలో బుల్ ర్యాలీ కొనసాగుతోంది.
ఈ క్రమంలో మార్కెట్లోకి వచ్చిన జై కైలాష్ నమ్కీన్ కంపెనీ ఐపీవో షేర్లు మాత్రం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేశాయి. మార్కెట్ల ర్యాలీ మధ్య లాభాలతో మంచి ప్రారంభాన్ని తొలుత నమోదు చేసిన ఐపీవో కొద్ది సేపటికే లోయర్ సర్క్యూట్ తాకటం బెట్టింగ్ వేసిన పెట్టుబడిదారులను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని చెప్పుకోవాలి.

వాస్తవానికి జై కైలాష్ నమ్కీన్ షేర్లు నేడు 16 శాతం కంటే ఎక్కువ లాభంతో రూ.85 వద్ద మార్కెట్‌లో లిస్ట్ చేయబడ్డాయి. కంపెనీ తన ఐపీవో ఇష్యూ గరిష్ఠ ధరను రూ.73గా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీవో మార్చి 28న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరచుకుని ఏప్రిల్ 3న ముగిసింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.11.93 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా కంపెనీ నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.1,16,800 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది.
ఇక్కడి వరకు విషయం బాగానే ఉన్నప్పటికీ.. లిస్టింగ్ అయిన వెంటనే జై కైలాష్ నమ్కీన్ షేర్లు కుప్పకూలాయి. కంపెనీ షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకి రూ.80.75 రేటుకు దిగజారాయి. ఇంట్రాడేలో నేడు స్టాక్ గరిష్ఠంగా రూ.86.90 స్థాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రమోటర్లకు ఐపీవోకి ముందర 71.82 శాతం వాటా ఉండగా.. ప్రస్తుతం అది 48.33 శాతానికి తగ్గింది.
జై కైలాష్ నమ్కీన్ కంపెనీ 2021లో ప్రారంభించబడింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో చనా జోర్ నమ్‌కీన్, మసాలా చనా జోర్, పుదీనా చానా, మసాలా మూంగ్ జోర్, ప్లెయిన్ మూంగ్ జోర్, సోయా స్టిక్స్, హల్దీ చానా, చనా దాల్ వంటి స్నాక్స్ ఉన్నాయి. కంపెనీ ప్లాంట్ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉంది. దీని రోజు ఉత్పత్తి సామర్థ్యం 10 టన్నులుగా ఉంది.


Click it and Unblock the Notifications