Tech Layoffs: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్నా లేఆఫ్స్ అనే మాట తప్ప మరో మాట వినిపించటం లేదు. ప్రధానంగా టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో కొనసాగుతున్న రీస్ట్రక్చరింగ్ ప్లాన్స్ ఖర్చుల మదింపుతో పాటు ఉత్తమ పనితీరుపై ఫోకస్ పెడుతున్నాయి.
ఈ క్రమంలోనే 1939లో స్థాపించబడిన జపాన్ దిగ్గజ టెక్నాలజీ సంస్థ తోషిబా మెగా లేఆఫ్ ప్లాన్ సిద్ధం చేసింది. జపాన్ టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ కంప్యూటర్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ఉంది. తాజాగా కంపెనీ చేతులు మారటంతో కొత్త యాజమాన్యం కింద భారీ పునర్నిర్మాణానికి గురవుతోంది. డిసెంబరులో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్(JIP) నేతృత్వంలోని కన్సార్టియం తోషిబా కంపెనీని 13 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన తర్వాత 4,000 మందిని దేశీయంగా తగ్గించాలని నిర్ణయించింది.

కొత్త యాజమాన్యం టేకోవర్ తర్వాత కుంభకోణాలు, కార్పొరేట్ అల్లకల్లోలంతో ఒక దశాబ్దానికి ముగింపు పలికింది. దీనికి తోడు కొనుగోలు తర్వాత తోషిబా షేర్లు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్టింగ్ చేయబడ్డాయి. దీనికి తోడు కంపెనీ తన కార్యాలయాన్ని సెంట్రల్ టోక్యో నుంచి కవాసకికి మార్చేపనిలో ఉంది. అలాగే రానున్న మూడేళ్లలో 10% ఆపరేటింగ్ లాభాల మార్జిన్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తోషిబాను పునరుజ్జీవింపజేయడానికి కన్సార్టియం చేస్తున్న ప్రయత్నాలు జపాన్‌లో ప్రైవేట్ ఈక్విటీకి ఒక పరీక్షగా నిశితంగా పరిశీలించబడుతున్నాయి.
ఒకప్పుడు జపాన్‌లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు రాబందులుగా విమర్శించబడ్డాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ జపాన్ సాంప్రదాయిక వ్యాపార సంస్కృతిలో క్రమంగా ఆమోదాన్ని పొందుతున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల అనేక ఇతర జపనీస్ కంపెనీలు ఇటీవల ఉద్యోగాల కోతలను ప్రకటించాయి.
వీటిలో ఫోటోకాపియర్ తయారీదారు కొనికా మినోల్టా, సౌందర్య సాధనాల సంస్థ షిసిడో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఓమ్రాన్ వంటివి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాపార అస్థిరతలతో అనేక కంపెనీలు తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు తదనుగుణంగా కార్పొరేట్ పునర్నిర్మాణాలకు దిగటం విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తోంది.


Click it and Unblock the Notifications