Jana nayagan: పక్కా ప్లాన్‌తోనే లీక్ చేశారా? విజయ్ సినిమా వివాదంపై సీబీఎఫ్‌సీ క్లారిటీ!
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'జన నాయకన్' (Jana Nayagan) చుట్టూ ఇప్పుడు పెద్ద వివాదం నెలకొంది. ఈ సినిమా విజయ్ కెరీర్‌లోనే చివరి చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, థియేటర్లలో విడుదల కావడానికి ముందే ఈ సినిమాకు సంబంధించిన హై-డెఫినిషన్ (HD) సీన్లు ఆన్‌లైన్ లో ప్రత్యక్షం కావడం చిత్ర యూనిట్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యవహారంపై తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగం అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

21 మందిపై ఫిర్యాదు.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు
ఈ లీక్ వ్యవహారంపై 'జన నాయకన్' నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ప్రతినిధి ఆర్. ఉదయకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా సినిమా ఫుటేజీని కాపీ చేసి, సర్క్యులేట్ చేసినట్లు ఆరోపిస్తూ మొత్తం 21 మందిని నిందితులుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలుత ఐదు నిమిషాల వీడియో బయటకు రాగా, ఆ తర్వాత క్లైమాక్స్ , టైటిల్ ఇంట్రడక్షన్ వంటి కీలక ఘట్టాలు కూడా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. నిందితుల నుంచి ల్యాప్‌టాప్ లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ప్రొడక్షన్ టీమ్ కోరుతోంది.
సీబీఎఫ్‌సీ క్లారిటీ: మా తప్పు లేదు!
సాధారణంగా సెన్సార్ బోర్డు (CBFC) నుంచే సినిమాలు లీక్ అవుతాయనే ప్రచారం జరుగుతుంటుంది. కానీ, ఈ ఆరోపణలను సీబీఎఫ్‌సీ ఖండించింది. సినిమా కంటెంట్ మొత్తం అత్యంత భద్రతతో కూడిన 'కెడిఎమ్' (KDM) మెకానిజం ద్వారా ప్రాసెస్ అవుతుందని, పాస్‌వర్డ్ లేకుండా ఎవరూ చూడలేరని స్పష్టం చేసింది. డిజిటల్ సినిమా ప్యాకేజీని మార్చి 17నే దరఖాస్తుదారులకు అప్పగించామని, ఆ తర్వాత తమ వద్ద ఎలాంటి డేటా లేదని బోర్డు వివరణ ఇచ్చింది.
ఇండస్ట్రీ మద్దతు: స్పందించిన స్టార్ హీరోలు
పైరసీ భూతంపై చిత్ర పరిశ్రమ ఏకమైంది. శివకార్తికేయన్, సోనూ సూద్ వంటి నటులు ఈ లీక్ ను తీవ్రంగా ఖండించారు. "వందలాది మంది రక్తం, చెమట చిందించి ఒక సినిమా తీస్తారు, దయచేసి పైరసీని ప్రోత్సహించకండి" అని శివ కార్తికేయన్ కోరారు. సోనూ సూద్ స్పందిస్తూ.. ఇది కేవలం చట్ట విరుద్ధమే కాదు, కళాకారుల కష్టాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి దిగ్గజాలు కూడా ఈ విషయంలో విజయ్ కు మద్దతుగా నిలిచారు.
ఏది ఏమైనా పైరసీ వల్ల సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరింది. జన నాయకన్ (Jana nayagan) వంటి పెద్ద సినిమాల విషయంలో ఇలా జరగడం విచారకరం. ప్రేక్షకులు కూడా పైరసీని ఎంకరేజ్ చేయకుండా, సినిమాను థియేటర్లలోనే చూసి చిత్ర పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications