IT Returns: ITR ఫైల్ చేయని మహిళకు కోర్టు శిక్ష ఖరారు.. ఆ తప్పు చేయడంతో చివరికి..
ITR Filing: రేపటితో మార్చి ముగియనుండటంతో ఆదాయపు పన్నుకు సంబంధించిన పనులు పూర్తి చేయడంలో వేతన జీవులు బిజీగా ఉన్నారు. ఏదైనా కారణాల వల్ల ITR తప్పుగా దాఖలు చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని త్వరపడుతున్నారు. అయితే తాజాగా ITR ఫైలింగ్ విషయమై ఢిల్లీలోని ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది.
ITR దాఖలు చేయనందుకు సావిత్రి అనే మహిళకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చింది. ఆదాయపు పన్ను కార్యాలయం (ITO) ఫిర్యాదు మేరకు న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను నిందితురాలు 2 కోట్ల విలువైన లావాదేవీ జరిపింది. ఇందుకుగాను 2 లక్షలు TDS కట్ అయింది. అయినప్పటికీ 2014-15 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆమె ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడంలో విఫలమైనట్లు తెలుస్తోంది.

'సాధారణంగా ఈ కేసులో 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 5 వేల జరిమానా విధించబడుతుంది. నేరం అంగీకరిస్తే కేవలం ఒక నెల సాధారణ కారాగార శిక్షకు ఆదేశిస్తాం' అని న్యాయమూర్తి తెలిపారు. సావిత్రి చదువులేని వితంతువు అని, మద్ధతుగా నిలిచేవారు ఎవరూ లేరని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకుని, కోర్టు 30 రోజులు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆర్డర్‌ను సవాలు చేయడానికి అవకాశం కల్పించింది.
ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయమని నిందితురాలికి నోటీసులు కూడా పంపినట్లు ఫిర్యాదుదారు కోర్టుకు తెలిపారు. అయితే రిటర్నులు ఫైల్ చేయడంలో ఆమె విఫలమైనట్లు స్పష్టం అయింది. దీంతో సెక్షన్ 276CC కింద సావిత్రిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ మేరక తన తీర్పు వెలువరించింది.


Click it and Unblock the Notifications