ITC Employees: దేశంలో ఐటీసీ గ్రూప్ సిగార్స్ నుంచి పేపర్, ఎఫ్ఎంసీజీ వరకు అనేక రంగాల్లో తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను వెల్లడించింది.
ఐటీసీ తాజా నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీలో కోటి కంటే ఎక్కువ వేతనం అందుకుంటున్న వారి సంఖ్య కొత్తగా 68 మంది చేరినట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో కొత్తగా కోటీశ్వరుల క్లబ్ లో మరో 68 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మెుత్తంగా కంపెనీ నుంచి ఏడాదికి కోటి వేతనంగా అందుకున్న వారి సంఖ్య ప్రస్తుతం 350కి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. గత ఏడాది కోటి రూపాయల కంటే కంపెనీ నుంచి ఎక్కువ వేతనాన్ని అందుకున్న వ్యక్తుల సంఖ్య 282గా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

వాస్తవానికి ఐటీసీ గ్రూప్ మెుత్తం అన్ని వ్యాపారాల్లో ఆర్థిక సంవత్సరంలో 24,567 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ ఉద్యోగులకు సగటున 5 శాతం వేతనాలను పెంచగా.. సీఈవో, ఎగ్జిక్యూటివ్ లకు మాత్రం 50-60 శాతం పెంపు అందించినట్లు వెల్లడైంది. ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో పురుషులకు సగటున వార్షికంగా రూ.1.11 కోట్లను కంపెనీ చెల్లించగా, ఈ స్థాయిలోని స్త్రీ ఉద్యోగులకు రూ.1.07 కోట్లను చెల్లించింది. ఇక సాధారణ ఉద్యోగులకు సగటున పురుషులకు రూ.7.14 లక్షల చెల్లిస్తుండగా.. స్త్రీలకు రూ.7.03 లక్షలు అందిస్తోంది.
ఐటీసీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అయిన సంజీవ్ పూరి FY24 కోసం రూ.28.62 కోట్ల గ్రాస్ రెమ్యునరేషన్‌ను అందుకున్నారు. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 49.6% అధికం. అలాగే కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమంత్ రూ.13.6 కోట్లను నెట్ జీతంగా అందుకున్నారు. ఇది గడచిన ఏడాది కంటే 52.4 శాతం పెరిగింది. అలాగే కంపెనీ ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా దాదాపు 30-50% వరకు పారితోషికాన్ని పెంచింది. ప్రస్తుతం ఐటీసీ కంపెనీ స్థూల వార్షిక ఆదాయం రూ.69,446.20 కోట్లుగా నిలిచింది.


Click it and Unblock the Notifications