TCS News: టీసీఎస్ అనైతిక పద్ధతులపై NITES ఆగ్రహం.. లేబర్ మినిస్ట్రీకి కంప్లెయింట్..
TCS News: దేశంలో టీసీఎస్ అత్యధిక సంఖ్యలో ఉద్యోగులకు ఉపాధిని కల్పిస్తూ అతిపెద్ద టెక్ సేవల కంపెనీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ అనైతిక పద్ధతులను అవలంభిస్తోందంటూ IT ఉద్యోగుల సంఘం NITES ఆరోపిస్తోంది.
టెక్ దిగ్గజం టీసీఎస్ 2,000 మందికి పైగా ఉద్యోగులను సరైన నోటీసులు లేదా సంప్రదింపులు లేకుండానే వివిధ నగరాలకు బదిలీ చేసిందంటూ ఐటీ ఉద్యోగుల సంఘం పేర్కొంది. వారిని బలవంతం చేస్తోందని, దీనివల్ల ఉద్యోగుల కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని 180కి పైగా ఫిర్యాదులు అందుకున్నట్లు NITES ప్రకటించింది. ఇది సరైన పద్ధతి కాదని అనైతిక బదిలీ పద్ధతులను టీసీఎస్ అవలంభిస్తోందంటూ కార్మిక మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది.

బదిలీ ఆదేశాలను పాటించడంలో వైఫల్యం క్రమశిక్షణా చర్యలకు దారి తీస్తుందని నైట్స్ ఆందోళన వ్యక్తం చేసింది. TCS చర్యలపై దర్యాప్తు చేయాలని, అటువంటి అనైతిక పద్ధతుల నుంచి టెక్ ఉద్యోగులను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖను NITES అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలుజా కోరారు. టీసీఎస్ తన ఉద్యోగులను అనవసర ఇబ్బందులకు గురిచేస్తోందని, వారి హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొంది.
టీసీఎస్ బదిలీ విధానాలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నాయో లేదో కార్మిక మంత్రిత్వ శాఖ నిర్థారించాలని ఐటీ ఉద్యోగుల సంఘం కోరింది. అలాగే అనైతిక బదిలీ పద్ధతుల నుండి IT ఉద్యోగులను రక్షించడానికి కొత్త విధానాలు, నిబంధనలను రూపొందించాలని మేము మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది. అయితే ఈ సంఘటనపై టీసీఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications