ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (23 జూన్) లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే హెచ్1బీ వీసాలపై అమెరికా నిర్ణయం కారణంగా ఐటీ షేర్లు మాత్రం తొలుత నష్టాల్లోకి జారుకొని, ఆ తర్వాత లాభాలబాట పట్టాయి. ఓ సమయంలో టీసీఎస్ వంటి దిగ్గజం 11 శాతానికి పైగా కుంగిపోయింది. మార్కెట్ ప్రారంభంలోనే టీసీఎస్ 11 శాతం, ఇన్ఫోసిస్ 5 శాతం నష్టపోయినప్పటికీ ఆ తర్వాత టీసీఎస్ 0.26 శాతం, విప్రో 1.54 శాతం, హెచ్‌సీఎల్ 1.33 శాతం, ఇన్ఫోసిస్ షేర్ 2.34 శాతం పెరిగింది.

బలపడిన రూపాయి..
నేడు ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 125.45 పాయింట్లు లేదా 0.36% ఎగిసి 35,036.77, నిఫ్టీ 44 పాయింట్లు లేదా 0.43% ఎగిసి 10,355.20 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 891 షేర్లు లాభాల్లో, 196 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 32 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 75.86 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్‌లో 76.03 వద్ద క్లోజ్ అయింది. కానీ హెచ్1బీ వీసాలను డిసెంబర్ వరకు అమెరికా రద్దుచేసిన నేపథ్యంలో ఐటీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి.

మన ఐటీ సంస్థలపై ప్రభావం తక్కువ
అమెరికా హెచ్1బీ వీసాలను రద్దు చేసినప్పటికీ అక్కడి మన ఐటీ సంస్థలపై (హెచ్‌సీఎల్, ఇన్పోసిస్, టీసీఎస్, విప్రో) పెద్దగా ప్రభావం చూపించదని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. గత కొన్నేళ్లుగా వివిధ కారణాల వల్ల మన ఐటీ కంపెనీలు స్థానిక ఉద్యోగులను నియమించుకుంటున్నాయని, కాబట్టి అంతగా ప్రభావం ఉండదని తెలిపింది. అయితే అమెరికా కంపెనీలు ఎక్కువగా ఈ వీసాలపై ఆధారపడతాయి కాబట్టి వాటిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మన ఐటీ ఉద్యోగులపై ప్రభావం
అయితే ఇండియన్ సహా అమెరికాలోని ఐటీ కంపెనీలు జారీ చేసే ఈ వీసాల్లో ఎక్కువగా భారతీయులవే. కాబట్టి భారత ఐటీ నిపుణులపై ఈ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. హెచ్1బీ, ఎల్1 వంటి వర్క్ వీసాలపై ఐటీ కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటాయి. ఈ రద్దు మాత్రం మన ఐటీ ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 40 శాతం నుండి 50 శాతం, విప్రో, హెచ్‌సీఎల్‌లలో 30 శాతం నుండి 40 శాతం మంది వరకు ఉంటారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ కంపెనీలు స్థానికీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

భారత ఐటీ రంగంపై తక్కువ ప్రభావం, మన అవసరమే వాళ్ళకు
వర్క్ వీసాలను పరిమితం చేయాలన్న అమెరికా ప్రకటన వల్ల భారత ఐటీ సేవల రంగంపై ఎక్కువగా ప్రభావం చూపించదని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సిపీ గుర్నానీ అన్నారు. హెచ్1బీ వీసాలపై ఆధారపడకుండా ఐటీ ఇండస్ట్రీ ఆత్మనిర్భర్‌గా మారిందన్నారు. తాము కూడా స్థానికంగా ఇంజినీర్లను నియమించుకుంటున్నామని, హెచ్1బీ వీసాల కోసం భారత్ నుండి అప్లికేషన్స్ తగ్గాయన్నారు. కాబట్టి ఇండియా లేదా ఇండియన్ కంపెనీలపై ఈ ప్రభావం స్వల్పకాలానికి తక్కువగా ఉంటుందన్నారు. అదే సమయంలో అమెరికాకు లేదా అమెరికా కంపెనీలకే భారత ఐటీ ప్రతిభ అవసరమని చెప్పారు. టెక్ మహీంద్రాపై తక్కువ ప్రభావం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే కంపెనీల కంటే వ్యక్తులపై (ఇండియా నుండి వెళ్లే ఇంజినీర్లు) ఎక్కువ ప్రభావం ఉండవచ్చునన్నారు.


Click it and Unblock the Notifications