రెండేళ్లు కష్టపడితే జీతం రూ.9 పెంచిన కంపెనీ.. నిబంధనల సంకెళ్లలో బందీనయ్యానంటూ భోరుమన్న టెకీ..
IT Sector Reality? భారతీయ ఐటీ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల గొంతుకగా మారిన ఒక ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి చెందిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రెడ్డిట్ వేదికగా తన గోడును వెళ్లబోసుకున్నారు. సంవత్సరానికి రూ. 4.25 లక్షల ప్యాకేజీతో ఒక ప్రముఖ బహుళజాతి కంపెనీలో చేరిన ఈ యువకుడు.. రెండేళ్ల తర్వాత తన కెరీర్‌లో వృద్ధి లేకపోగా, కంపెనీ నిబంధనల సంకెళ్లలో బందీనయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. 2025లో తనకు లభించిన జీత పెంపు అక్షరాలా కేవలం 9 రూపాయలు మాత్రమేనని, ఈ ఏడాది అసలు పెంపు అనే మాటే లేదని ఆయన వెల్లడించడం కార్పొరేట్ కంపెనీల దోపిడీకి అద్దం పడుతోంది.
ఆ ఇంజనీర్ వివరించిన వివరాల ప్రకారం.. అతను మే 2024లో ఇంటర్న్‌గా చేరి, ఆపై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తక్కువ ప్యాకేజీకైనా సిద్ధపడి చేరినట్లు తెలిపారు. అయితే, కంపెనీ విధించిన షరతులు అతన్ని ఆర్థికంగా, మానసిక కుంగుబాటుకు గురి చేస్తున్నాయి. రెండేళ్ల సర్వీస్ బాండ్‌పై సంతకం చేసిన కారణంగా, ఒకవేళ రాజీనామా చేయాలంటే రూ. 1.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంతటితో ఆగకుండా ఆ జరిమానా కట్టిన తర్వాత కూడా ఆరు నెలల నోటీసు పీరియడ్‌ను పూర్తి చేయాలనే నిబంధన ఒక బానిసత్వాన్ని తలపిస్తోందని ఆయన వాపోయారు. తక్కువ జీతం పెరిగిన ఖర్చుల మధ్య అసలు పొదుపు చేయలేకపోతున్నానని.. పని ఒత్తిడి వల్ల వారాంతాల్లో కూడా విశ్రాంతి దొరకడం లేదని పేర్కొన్నారు.

మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. కంపెనీ ప్రాంగణానికి వెళ్లడానికి క్లయింట్ ఆఫీసులకు తిరగడానికి అయ్యే ప్రయాణ ఖర్చులను కూడా కంపెనీ భరించకపోగా, షటిల్ సేవల పేరుతో వేల రూపాయల జీతాన్ని కోత విధిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టులు మార్చుకున్నా, గ్రేడ్లు పెంచినా కేవలం హోదాలో మార్పు వస్తోంది తప్ప, జీతంలో నయాపైసా పెరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతున్న ఒక లోతైన గోతిలో నేను ఇరుక్కుపోయినట్లు అనిపిస్తోంది" అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేసిన ఈ పోస్ట్, నేటి కార్పొరేట్ సంస్కృతిలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లను కళ్లకు కట్టింది.
దీనికి తోడు, కార్పొరేట్ కార్యాలయాల్లోని విషపూరితమైన వాతావరణం (Toxic Work Culture) గురించి మరో ఉదంతం కూడా బయటకు వచ్చింది. ఒక ఉద్యోగికి తీవ్రమైన జ్వరం, కడుపునొప్పి రావడంతో అనారోగ్య సెలవు కోరగా, "ఆసుపత్రిలో చేరితే తప్ప సెలవు మంజూరు చేయలేం" అని సదరు మేనేజర్ నిర్దాక్షిణ్యంగా సమాధానమిచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల పట్ల సానుభూతి లేని ఇటువంటి ధోరణులు ఐటీ రంగంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి ప్రధాన కారణమవుతున్నాయి.
కంపెనీల ఎదుగుదలకు రక్తం ధారపోస్తున్న యువ ఇంజనీర్లకు కనీస గుర్తింపు, గౌరవం దక్కకపోవడమే కాకుండా, బాండ్లు మరియు కఠిన నిబంధనల పేరుతో వారిని బందీలుగా మార్చుకుంటున్న తీరుపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నైపుణ్యం కలిగిన యువతను కేవలం తక్కువ ఖర్చుతో కూడిన శ్రమశక్తిగా చూడటం ఆపాలని, వారి ఆర్థిక భద్రత, మానసిక ఆరోగ్యం పట్ల కంపెనీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications