Dhiraj Sahu: ఇటీవల జార్ఖండ్, ఒడిశాలో జరిగిన ఆదాయపు పన్ను సోదాల్లో నోట్ల కట్టల గుట్టలు బయటపడ్డాయి. వీటిని లెక్కించలేక కౌంటింగ్ మెషిన్లు సైతం చెడిపోయాయంటే మీరే ఆలోచించుకోండి.
దాదాపు మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో కొనసాగిన సోదాల్లో దాదాపు రూ.290 కోట్లు బయటపడ్డాయి. దాదాపు 156 సంచుల డబ్బు బయటపడినట్లు వార్తలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ నేతలు, సంబంధిత వర్గాలపై ఐటీ సోదాలు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేత జేపీ నడ్డా మాట్లాడుతూ దీనిపై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని అన్నారు. ఇది న్యూ ఇండియా అని రాజకుటుంబాల పేరుతో దోపిడీ చేస్తే ప్రజలు అనుమతించరని అన్నారు.

ఇదే వ్యవహారంపై ప్రధాని మోదీ సైతం కాంగ్రెస్ పార్టీపై సీరియస్ అయ్యారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ మాట్లాడుతూ ఈ వ్యవహారంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. లిక్కర్ తయారీ కంపెనీ బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణాల్లో జరిపిన సోదాల్లో దొరికిన డబ్బును లెక్కించేందుకు పన్ను శాఖ అధికారులు మెుత్తం 40 డబ్బు కౌంటింగ్ మెషీన్లను వినియోగిస్తోంది.
స్వాధీనం చేసుకున్న నగదును రాష్ట్రంలోని ప్రభుత్వ బ్యాంకులకు తరలించడానికి శాఖ ద్వారా మరిన్ని వాహనాలను కోరారు. మద్యం తయారీ సంస్థకు చెందిన వివిధ ప్రాపర్టీలతో పాటు, జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందిన ప్రాంగణంలో కూడా ఐటీ శాఖ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ డబ్బు వ్యవహారంలో అటు డిస్టిలరీ గ్రూప్ కానీ ఇటు కాంగ్రెస్ ఎంపీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ డబ్బుకు సంబంధించిన పూర్తి లెక్కలను ఐటీ అధికారులకు చూపాల్సి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications