AI News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గూగుల్ వెనకబడి ఉంది. మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీకి ఫండింగ్ చేసి సంచలనం సృష్టించగా.. టెక్ దిగ్గజం మాత్రం నెమ్మదిగా బార్డ్‌తో ముందుకొచ్చింది. తర్వాత దాన్ని కాస్తా జెమిని గా నామకరణం చేసింది. అయితే ఇప్పుడు దాని పనితీరు.. గూగుల్‌కు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
ప్రధాని మోదీ గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు గూగుల్ జెమిని ఇచ్చిన సమాధానం భారత ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. AI చెప్పిన సమస్యాత్మక మరియు చట్టవిరుద్ధమైన ప్రతిస్పందనలపై గూగుల్‌కి IT మంత్రిత్వ శాఖ నోటీసులు జారీచేసే ప్రక్రియలో ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

కొన్ని చారిత్రాత్మక చిత్రాల విషయంలో గూగుల్ జెమిని చెప్పిన సమాధానాలపై ఇటీవల విమర్శలు చెలరేగాయి. ఈ వ్వవహారంపై గూగుల్ క్షమాపణలు కూడా చెప్పింది. కానీ తాజాగా మరోసారి ప్రధాని మోదీ 'ఫాసిస్ట్' అవునా కాదా అని అడిగిన ప్రశ్నకు మరోసారి వివాదాస్పద సమాధానం ఇచ్చింది.'కొందరు నిపుణులు ఫాసిస్ట్‌గా వర్ణించిన విధానాలను అమలు చేసినందుకు మోదీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. బీజేపీ హిందూ జాతీయవాద భావజాలం, అసమ్మతి అణిచివేత మరియు మతపరమైన మైనారిటీల మీద హింసను ఉపయోగించడమూ మరో కారణం' అని పేర్కొంది.
అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్ ట్రంప్ గురించి ఇదే ప్రశ్న అడిగినప్పుడు జెమిని ఇందుకు భిన్నంగా స్పందించింది. 'వేగంగా మారుతున్న సమాచారంతో పోల్చిచూస్తే ఎన్నికలు సంక్లిష్టమైన అంశం. అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్‌లో శోధనను ప్రయత్నించండి' అని సూచిస్తోంది.
ఈ వ్యవహారంపై ఎలక్ట్రానిక్స్ మరియు IT శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. 'ఇది IT చట్టంలోని మధ్యవర్తిత్వ నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. గూగుల్ AI సిస్టమ్ పక్షపాతాలతో నిండిన సమాధానాలను అందించడం ఇది రెండవసారి అని మరో సీనియర్ అధికారి తెలిపారు. షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్లు చెప్పారు. వారి సమాధానాలు సంతృప్తికరంగా లేనట్లయితే విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications