సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌కు కేంద్ర మంత్రి హెచ్చరిక.. మెటా, గూగుల్‌కు కొంతమేర ఉపశమనం..
పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా భారత ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. వ్యక్తిగత డేటా భద్రత కోసం ఉద్దేశించిన డేటా ప్రొటెక్షన్ బిల్లు అందులో ఒకటి. దీనికి సంబంధించి భారతీయుల సమాచారాన్ని నిర్వహిస్తున్న పలు కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం అందించింది. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు.
డేటా ప్రొటెక్షన్ బిల్లుకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, IT శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. పలు కార్పొరేట్ సంస్థలతో సమావేశమయ్యారు. చట్టానికి అనుగుణంగా తమ సిస్టమ్స్ ను అప్ గ్రేడ్ చేసుకునేందుకు మెటా, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలకు సుమారు ఏడాది వ్యవధి ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.

దేశం శరవేగంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో.. ఆన్ లైన్, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ పౌరుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేయకూడదన్నారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అతిక్రమణదారులపై 250 కోట్ల వరకు జరిమానా విధించనుండగా.. ఈ మొత్తాన్ని 500 కోట్ల వరకు పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి అప్పిలేట్ అథారిటీ ఏర్పాటుపై రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడారు. ఇందుకోసం 30 రోజుల్లో డేటా ప్రొటెక్షన్ బోర్డు (DPB)ని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చట్టానికి సంబంధించిన నిబంధనలను సైతం ఇప్పటికే రూపొందించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మెటా, నెట్‌ఫ్లిక్స్, డెల్ సహా దాదాపు 125 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications