Wipro: షేర్ల బై బ్యాక్ నిర్ణయంలో టెక్ దిగ్గజం విప్రో.. నేడు మార్కెట్లో లాభపడిన షేర్..
Wipro: నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్న దేశీయ టెక్ కంపెనీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా, యూరోపియన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థలతోనే ఈ కంపెనీలు పనిచేస్తున్నాయి. 90 శాతానికి పైగా ఆదాయం వస్తున్న ఈ రంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉండటంతో ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి.
ఇలాంటి తరుణంలో టెక్ కంపెనీ విప్రో తమ షేర్లను మార్కెట్ల నుంచి బైబ్యాక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు డైరెక్టర్ల బోర్డు ఏప్రిల్ 26, 27 తేదీల్లో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో నేడు మార్కెట్లో షేర్లు పాజిటివ్ మెుమెంటం చూశాయి. మధ్యాహ్నం 3.12 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో విప్రో షేర్ 2.77 శాతం లాభపడి రూ.378.25 వద్ద ట్రేడవుతోంది.

గత ఏడాది కాలంలో విప్రో షేర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనిని చక్కదిద్దేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా కంపెనీ తన పెట్టుబడి విలువను పెంచానికి, ఈక్విటీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు షేర్ల బైబ్యాక్ మార్గాన్ని ఎంచుకుంది. నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయటానికి ముందే బైబ్యాక్ ప్లాన్‌ను ప్రకటించడంతో మార్కెట్లోని చాలా మంది ఇన్వెస్టర్లు కంపెనీపై దృష్టి సారించారు.
ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక పక్క ఆదాయాలు తగ్గుతుండగా కంపెనీ మరో పక్క షేర్ల బైబ్యాక్ ప్లాన్ చేస్తోంది. ఈ కారణాలతో విప్రో ఉద్యోగుల జీతాల పెంపు స్వల్పంగానే ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 25న రూ.529 వద్ద ఉన్న విప్రో షేర్ ధర ఏడాది కాలంలో 30 శాతానికి పైగా క్షీణించి ప్రస్తుతం రూ.378 వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ క్షీణతను తిప్పికొట్టేందుకు షేర్ల బైబ్యాక్ ప్రణాళికను కంపెనీ తెరమీదకు తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications