Wipro News: అంచనాలను అందుకోలేక పోయిన విప్రో లాభాలు.. అదే కారణమా..?
Wipro Q1 Results: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా తన క్యూ1 ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ ఊహించిన దాని కంటే తక్కువ లాభాలను నమోదు చేయటంతో మార్కెట్ వర్గాలు నిరాశకు లోనయ్యాయి.
మెుదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.2,870 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో లాభాలను పరిశీలిస్తే రూ.2,563.60గా ఉంది. ఏడాది ప్రాతిపదికన లాభం 12 శాతం పెరిగినప్పటికీ.. మార్కెట్ వర్గాలు 20 శాతం వృద్ధిని అంచనా వేశారు. లాభాల విషయంలో అంచనాలను అందుకోలేక పోయినప్పటికీ ఆదాయాల విషయంలో మాత్రం రూ.22,831 కోట్లతో 6.04 శాతం ఎగబాకింది.

ఐటి సేవల విభాగం ఆదాయం 0.8 శాతం పెరిగి 2,778.5 మిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు విప్రో వెల్లడించింది. త్రైమాసికంలో మొత్తం ఆర్డర్ విజయాలు 3.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే క్రమంలో పెద్ద డీల్స్ పరిశీలిస్తే 1.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఐటీ సర్వీసెస్ సెగ్మెంట్ ఆపరేటింగ్ మార్జిన్ 112 బేసిస్ పాయింట్లు పెరిగి 16 శాతంగా ఉంది. రానున్న త్రైమాసికంలో ఈ విభాగం నుంచి 2,722- 2,805 మిలియన్ డాలర్లను లక్ష్యంగా పెట్టుకుంది. మెుదటి త్రైమాసికంలో బలమైన డీల్స్ వెన్నుగా నిలిచాయని సీఈవో అండ్ ఎండీ థియరీ డెలాపోర్టే అన్నారు.
క్లయింట్‌ల విచక్షణతో కూడిన ఖర్చులో క్రమంగా తగ్గింపు ఉన్నప్పటికీ కొత్త వ్యాపారం పెరగటంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. ప్రధానంగా విప్రో AI360 ప్రారంభం ఇందులో భాగంగా ఉంది. కంపెనీ ఇందుకోసం రానున్న మూడేళ్ల కాలంలో ఏకంగా 1 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో కంపెనీ ఆపరేషనల్ ఇంప్రూవ్‌మెంట్‌పై దృష్టిని కొనసాగిస్తున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ వెల్లడించారు.
వరుసగా మూడో త్రైమాసికంలో కూడా కంపెనీ కొత్త నియామకాలను తగ్గించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ దాదాపు 15000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటి నుంచి నియామకాలు ఊపందుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications