Share Buyback: దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్. టాటాల నేతృత్వంలో నడుస్తున్న కంపెనీ అవకాశం దొరికినప్పుడల్లా తన షేర్లను మార్కెట్ల నుంచి తిరిగి వెనక్కి కొంటోంది. గడచిన కొన్నేళ్లుగా ఈ పద్ధతిని అవలంభిస్తోంది.
ఈ క్రమంలోనే డిసెంబర్ 1, 2023 నుంచి డిసెంబర్ 7, 2023 మధ్య కాలంలో మరోమారు షేర్ల బైబ్యాక్ చేపడుతోంది. ఈసారి టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ తాజా రౌండ్ లో రూ.17,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రణాళికను నవంబర్ 28న స్టాక్ ఎక్ఛ్సేంజీ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. IT సేవల సంస్థ రూపాయి ఫేస్ వ్యాల్యూ కలిగిన 4.09 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయాలని ప్రతిపాదించింది.

కంపెనీ ఒక్కో టీసీఎస్ షేరును రూ.4,150 రేటు చొప్పున తిరిగి కొనాలని నిర్ణయించింది. షేర్ల బైబ్యాక్ కంపెనీ లాభదాయకపై ఎలాంటి ప్రభావం చూపదని, పెట్టుబడుల కోసం అందుబాటులో ఉన్న మెుత్తం నుంచి బైబ్యాక్ కోసం నిధులను వినియోగిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. తాజా కొనుగోలు తర్వాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 72.3 నుంచి 72.41 శాతానికి పెరుగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,96,03,690 షేర్లను, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 11,358 షేర్ల కోసం టెండర్ చేయనుంది.
TCS 2017లో మొదటిసారిగా ఫిబ్రవరిలో 16,000 కోట్ల విలువైన తన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేసింది. అప్పట్లో మార్కెట్ ధర కంటే 18 శాతం ప్రీమియం చెల్లించి బైబ్యాక్ చేపట్టింది. దీని తర్వాత జూన్ 2018, అక్టోబర్ 2020లో 18, 10 శాతం ప్రీమియంతో రూ.16,000 కోట్ల చొప్పున రెండు బైబ్యాక్‌లు జరిగాయి. చివరిది జనవరి 2022లో కంపెనీ రూ.18,000 కోట్ల విలువైన షేర్లను 17 శాతం ప్రీమియంతో టీసీఎస్ యాజమాన్యం ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications