IT News: టీసీఎస్ టెక్కీలకు శుభవార్త.. ఈ సారి జీతాల పెంపు ఎంత శాతమంటే..??
TCS Salary Hike: ఐటీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మదిలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగం ఊడకుండా ఉంటే చాలనే భావన కొనసాగుతోంది. కానీ ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో సైతం దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ వేతన పెంపుకు సన్నాహాలు చేస్తోంది. టెక్కీలకు ఇది కొంత ఊరటను కలిగించే ప్రకటనే చెప్పుకోవచ్చు.
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2024-25లో దాని ఆఫ్‌సైట్ ఉద్యోగులకు సగటున 7-8 శాతం, ఆన్‌సైట్ ఉద్యోగులకు 2-4 శాతం జీతాల పెంచనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అద్భుతమైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 12-15 శాతం వేతన పెంపును ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంక్రిమెంట్‌లు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి రానున్నాయి. ప్రమోషన్ల విషయాన్ని కూడా కంపెనీ పరిగణిస్తోందని అయితే అవి 2025 ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికంలో ఉండొచ్చని అంచనా వేయబడింది.

వేతనాల పెంపు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. అయితే పదోన్నతులు, ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఖర్చు ఆందోళనల కారణంగా కఠినమైన పరిశీలనలో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే వేతన పెంపు ప్రక్రియపై ఇప్పటి వరకు టీసీఎస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కంపెనీ పాలసీ ప్రకారం ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించలేమని టీసీఎస్ ప్రతినిధి చెప్పినట్లు నివేదిక పేర్కొంది.
2023లో టీసీఎస్ పనిలో అసాధారణమైన ప్రదర్శన చూపిన ఉద్యోగులకు 12-15 శాతం మేర వేతన పెంపును అందించిన సంగతి తెలిసిందే. అలాగే తాజా వార్షిక పరిహారం సమీక్షలో అసాధారణ ప్రదర్శనకారులకు 12-15 శాతం పెంపును అందించామని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమోషన్ల ప్రక్రియ కూడా షురూ అయినట్లు ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications