TCS News: ఒక్క దెబ్బకు రూ.15,000 కోట్లు కోల్పోయిన టీసీఎస్.. పాపం ఇన్వెస్టర్లు..
TCS Share: రెండు రోజుల కిందట అమెరికాకు చెందిన ట్రాన్సామెరికా లైఫ్ ఇన్సూరెన్స్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటన టీసీఎస్ కంపెనీకి పెద్ద దెబ్బ తగిలింది. దలాల్ స్ట్రీట్‌లో రెండవ అత్యంత విలువైన స్టాక్ అయిన TCS షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 1 శాతానికి పైగా పతనమయ్యాయి.
2018లో జరిగిన డీల్ 10 ఏళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా కాంట్రాక్టును ముందుగానే తొలగిస్తున్నట్లు తేలింది. దీనికి రెండు సంస్థలు పరస్పరం అంగీకరించటంతో టీసీఎస్ దాదాపు 2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇది కంపెనీతో పాటు స్టేక్ హోల్డర్లు ఊహించని పరిణామం. దీంతో అతిపెద్ద ఐటీ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం రూ.15,002.11 కోట్లు తగ్గి రూ.11,61,840 కోట్లకు పడిపోయింది. షేరు ధర 1.27 శాతం క్షీణించి రూ.3,175.25 వద్ద స్థిరపడింది.

ఇది ఐటి సెక్టార్‌లో డిమాండ్ మందగించడంపై ఈ రద్దు ఆందోళన రేకెత్తించింది. గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల కారణంగా మరిన్ని భారతీయ టెక్ కంపెనీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండవచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో అమెరికాకు చెందిన రేటింగ్ సంస్థ JP మోర్గాన్ TCSతో పాటు మరో రెండు ఐటీ సేవల కంపెనీలపై ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వీటి Q1FY24 రాబడులు, మార్జిన్లు, ఫలితాలు మార్కెట్లను నిరాశపరుస్తాయని పేర్కొంది.
ప్రస్తుతం టీసీఎస్ ముగించిన డీల్ ఒప్పందం ప్రకారం ఏడాదికి కంపెనీ దాదాపు 200 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని పొందుతుంది. అయితే ఈ డీల్ క్లోజ్ కావటంతో టీసీఎస్ ఆదాయం దాదాపు 2-3 శాతం తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే కంపెనీలో ప్రస్తుతం కొత్త సీఈవో రావటంతో కొంత అస్థిరత ఏర్పడవచ్చని జేపీ మోర్గన్ అంచనా వేసింది. అలాగే మార్చి 2024 నాటికి స్టాక్ ధర రూ.2,700 లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపింది.


Click it and Unblock the Notifications