Q1 Results: దేశంలోని టాప్-5 టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ శుక్రవారం తన మెుదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీనికి ముందు మరో టెక్ దిగ్గజం టీసీఎస్ మెుదటగా ఆర్థిక ఫలితాలను ప్రకటించి ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ చేసింది. అయితే టీసీఎస్ ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుకూలంగా ఉండటంతో వారాంతంలో స్టాక్ మార్కెట్లు మెగా ర్యాలీని నమోదు చేశాయి.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,534 కోట్లతో పోలిస్తే.. 2024 జూన్ త్రైమాసికంలో నికర లాభంలో 20.46 శాతం పెరిగి చేసి రూ.4,257 కోట్లకు చేరుకుంది. మెుదటి త్రైమాసిక కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 6.70 శాతం పెరిగి రూ.28,057 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.2 మధ్యంతర డివిడెండ్ అందించేందుకు ఆమోదం తెలిపింది. మధ్యంతర డివిడెండ్ చెల్లింపు కోసం నిర్ణయించిన జూలై 23, 2024 రికార్డు తేదీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ధృవీకరించారు. ఈ మధ్యంతర డివిడెండ్ చెల్లింపు తేదీ ఆగస్ట్ 1, 2024గా ఉంటుంది.

HCLTech కొత్త డీల్ విజయాలు 1.96 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని వెల్లడించింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఆర్డర్ బుక్ 1.56 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీ జర్మన్ బ్యాంక్ అపోబ్యాంక్‌తో 7.5 సంవత్సరాలలో 278 మిలియన్ డాలర్లు విలువైన డీల్ విస్తరణను ప్రకటించింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఐదేళ్ల ఒప్పందాన్ని ప్రకటించింది. పనితీరు అంచనాల కంటే కొంచెం మెరుగ్గా ఉందని, రాబోయే త్రైమాసికాల్లో మంచి వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసం ఉందని సీఈవో సి విజయకుమార్ పేర్కొన్నారు.
కంపెనీ తన మెుదటి త్రైమాసిక ఫలితాలను మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత ప్రకటించింది. ఈ క్రమంలో మార్కెట్ ముగింపు సమయంలో కంపెనీ షేర్ ధర 3.20 శాతం పెరిగి రూ.1,560.40 వద్ద ముగిసింది. ఇదే క్రమంలో ఐటీ రంగంలోని అతిపెద్ద సంస్థ అయిన టీసీఎస్ మెుదటి త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 8.72 శాతం వృద్ధితో రూ.12,040 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు టీసీఎస్ క్యూ1 ఫలితాలు బలమైన ప్రోత్సాహకంగా నిలిచాయి. ఇది ఇతర IT స్టాక్‌లలో భారీ ర్యాలీని ప్రేరేపించింది. ఈ క్రమంలో కొనసాగిన మెగా ర్యాలీతో బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 81,000 మార్క్‌కు చేరువైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications