Cognizant News: ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఒక ట్రైనీగా పనిచేయటం ప్రారంభించి రిటైర్ అయ్యేంత వరకు టెక్ రంగంలోనే ఉద్యోగిగా కొనసాగేవారి సంఖ్య వాస్తవానికి చాలా తక్కువ. అనేక కారణాలతో ఈ మధ్యలోనే చాలా మంది తమ ప్రయాణ దిశను మార్చుకుంటుంటారు.
ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు తమ పాలసీలను యాజమాన్య నిర్ణయాలకు అనుకూలంగా మార్చుకుంటుంటాయి. ఈ క్రమంలోనే ఇండియా పుట్టి అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ తాజాగా తన భారతీయ ఉద్యోగులకు సంక్రాంతి పండుగకు ముందు తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం కంపెనీలో ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించింది. పాలసీ అప్‌డేట్ గురించి కంపెనీ తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది.

భారతదేశంలోని అన్ని కాగ్నిజెంట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇకపై వయో పరిమితిని రిటైర్మెంట్ కోసం పెంచినదే అమలవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రతిభను, ప్రత్యేకించి మార్కెట్ ప్రాక్టీస్, అనుభవం ఉన్నవారిని నిలుపుకునేందుకు ఈ నిర్ణయంతో కంపెనీ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలన్నీ ఇప్పటికీ ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో 58 ఏళ్ల వయస్సునే పరిగణిస్తున్నాయి.
పదవీ విరమణ రోజున సంబంధిత ఉద్యోగుల వద్ద ఉన్న షేర్లను కూడా పదవీ విరమణ చేసిన వెంటనే ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కొత్త పాలసీ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నుండి ప్రత్యేక అనుమతి పొందకపోతే, ఉద్యోగి 58 ఏళ్ల వయస్సులో ఈపీఎఫ్ ఖాతా మూసివేయబడుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పలుమార్లు పెంచిన సంగతి తెలిసిందే.
ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి వెళ్లి కాగ్నిజెంట్ సీఈవోగా వ్యవహరిస్తున్న రవి కుమార్ ఉద్యోగులకు వార్షిక వేతన పెంపులను సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2022 నుండి ఈ అదనపు వేతనాన్ని పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన కంపెనీ మార్కెట్ అంచనాలకు మించిన పనితీరును కనబరిచిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ త్రైమాసికంలో దాదాపు 13,000 మంది ఉద్యోగులు కొత్తగా కంపెనీలోకి వచ్చారని, ఇదే క్రమంలో అట్రిషన్ రేటు 14.6 శాతానికి తగ్గిందని వెల్లడైంది.


Click it and Unblock the Notifications